Karnataka : ప్రైవేట్ రంగంలో సి, డి కేటగిరీ పోస్టులకు 100శాతం కన్నడిగులకు రిజర్వేషన్ తప్పనిసరి చేస్తూ బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం ప్రకటించారు. ఈ బిల్లు ప్రకారం మేనేజ్‌మెంట్ పోస్టుల్లో 50శాతం, నాన్-మేనేజిరియల్ పోస్టుల్లో 75శాతం స్థానిక అభ్యర్థులను నియమించడం తప్పనిసరి. కన్నడిగులకు సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చేలా చూడాలని, సొంత రాష్ట్రంలోనే మంచి జీవనం సాగించే అవకాశం రావాలన్నదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి అన్నారు.
Read Also:Uttarpradesh : అంతా అబద్ధం.. ఆ యువకుడిని ఏడు సార్లు కాదు ఒక సారే పాము కరిచింది
‘కర్ణాటక రాష్ట్ర పరిశ్రమలు, కర్మాగారాలు, ఇతర సంస్థలలో స్థానిక అభ్యర్థులకు ఉపాధి కల్పించే బిల్లు, 2024’ను గురువారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. స్థానిక అభ్యర్థి అంటే కర్ణాటకలో పుట్టి 15 ఏళ్లుగా రాష్ట్రంలో నివాసం ఉంటూ, కన్నడ భాషను చదవడం, రాయడం, మాట్లాడడం తెలిసిన వ్యక్తి ఇందుకు అర్హుడని బిల్లు నిర్వచించింది. అభ్యర్థులు తప్పనిసరిగా కన్నడ భాషతో సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. లేని పక్షంలో ప్రభుత్వం నోటిఫై చేసిన నోడల్ ఏజెన్సీ ద్వారా నిర్దేశించిన కన్నడ ప్రావీణ్యం పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అర్హత కలిగిన స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేకుంటే, పరిశ్రమలు, సంస్థలు ప్రభుత్వ సహకారంతో స్థానిక అభ్యర్థులకు మూడేళ్లలో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాయి.
Read Also:Silver Rate Today: వెండి కూడా బంగారమైంది.. లక్ష రూపాయలు దాటేసింది!
తగినంత సంఖ్యలో స్థానిక అభ్యర్థులు ఇప్పటికీ అందుబాటులో లేకుంటే, కంపెనీలు మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఇచ్చిన సడలింపు మేనేజ్‌మెంట్ వర్గాలకు 25శాతం, నాన్-మేనేజ్‌మెంట్ వర్గాలకు 50శాతం కంటే తక్కువ ఉండకూడదు. ఎంప్లాయ్‌మెంట్ లోకల్ క్యాండిడేట్స్ యాక్ట్‌ను పాటించనందుకు రూ.10,000 నుంచి రూ.25,000 వరకు జరిమానా విధించవచ్చు.