Karnataka: కర్ణాటకలో బైక్ టాక్సీలకు హైకోర్టు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో బైక్ టాక్సీ సేవలపై విధించిన నిషేధాన్ని కర్ణాటక హైకోర్టు శుక్రవారం ఎత్తివేసింది. సిద్ధరామయ్య ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సమర్థిస్తూ గతంలో వచ్చిన సింగిల్ జడ్జి ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది. చీఫ్ జస్టిస్ విభు బాఖ్రు, జస్టిస్ సీఎం జోషిలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కీలక తీర్పు వెలువరించింది. ఓలా, ఉబర్, రాపిడో వంటి అగ్రిగేటర్లు దాఖలు చేసిన అప్పీల్స్‌ను అనుమతిస్తూ.. మోటార్‌సైకిళ్లను కూడా చట్టబద్ధంగా రవాణా వాహనాలుగా ఉపయోగించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఇందుకు అవసరమైన అనుమతులు, లైసెన్సులు తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది.
READ MORE: Family Suicide: ఏం కష్టం వచ్చిందో.. కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నం.. ముగ్గురు మృతి, ఒకరికి సీరియస్..
ఏప్రిల్ 2025లో జారీ చేసిన బైక్ టాక్సీ నిషేధ ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. బైక్ యజమానులు, అగ్రిగేటర్లు అవసరమైన లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది. అలాగే, ప్రస్తుత చట్టాల ప్రకారం అనుమతులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. “వాహనం మోటార్‌సైకిల్ అనే కారణంతోనే టాక్సీగా రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించలేరు” అని కోర్టు తేల్చిచెప్పింది. తాజా ఉత్తర్వుల్లో కోర్టు మరోసారి స్పష్టత ఇచ్చింది. “బైక్ యజమానులు తమ మోటార్‌సైకిళ్లను ట్రాన్స్‌పోర్ట్ వాహనాలుగా లేదా కాంట్రాక్ట్ క్యారేజీలుగా నమోదు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం చట్టం ప్రకారం వాటిని పరిశీలించాలి. అలాగే అగ్రిగేటర్లు కొత్తగా దరఖాస్తులు చేసుకునే స్వేచ్ఛ ఉంది. వాటిని కోర్టు సూచనల మేరకు పరిశీలించాలి” అని పేర్కొంది.
READ MORE: Vasant Panchami: వసంత పంచమి ఎందుకు జరుపుకుంటారు..? ప్రత్యేకత ఏంటి..?
కర్ణాటకలో బైక్ టాక్సీ సేవలపై నిషేధం గత ఏడాది జూన్‌లో అమల్లోకి వచ్చింది. స్పష్టమైన నియంత్రణ విధానం లేదన్న కారణంతో రాపిడో, ఓలా, ఉబర్ మోటో వంటి సేవలను అక్రమమని పేర్కొంటూ హైకోర్టు అప్పట్లో ప్రభుత్వ ఉత్తర్వులను సమర్థించింది. ఆ తర్వాత ప్రభుత్వం పూర్తిస్థాయి నిషేధాన్ని అమలు చేసింది. నిషేధం విధించిన సమయంలో అగ్రిగేటర్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీలను ఆశ్రయిస్తూ జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ నిషేధం వల్ల లక్షలాది మంది డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటుందని, తక్కువ ఖర్చుతో ప్రయాణించే సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని హెచ్చరించారు.
అయితే రెండు నెలల తర్వాత, కోర్టు అనుమతి లేకుండానే ఆగస్టు 2025లో రాపిడో మళ్లీ సేవలు ప్రారంభించింది. దీనిపై కర్ణాటక స్టేట్ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించిందంటూ రాపిడోపై ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. ఇప్పుడు తాజా హైకోర్టు తీర్పుతో బైక్ టాక్సీ సేవలకు మళ్లీ దారి తెరచుకుంది. అయితే, స్పష్టమైన నిబంధనలు, అనుమతుల ప్రక్రియను పాటిస్తూ సేవలు కొనసాగాలని కోర్టు తేల్చడంతో రాష్ట్రంలో బైక్ టాక్సీల భవిష్యత్తుపై స్పష్టత వచ్చినట్టయింది.
