Bapatla : బాపట్ల జిల్లా కర్లపాలెంలోని పోలీస్ స్టేషన్లో విచిత్రమైన ఫిర్యాదు వచ్చింది. ఓ తొమ్మిదేళ్ల బాలుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్సైకు తండ్రిపై ఫిర్యాదు చేశాడు. తల్లి బాధ చూడలేక తన సమస్యను ధైర్యంగా ఎస్సైకు వివరించాడు. తన తల్లిని తండ్రి ఇబ్బందులు పెడుతున్నాడని అతడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ చిన్నోడి ధైర్యానికి పోలీసులు షాక్ తిన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.
Read Also:Manipur Violence: అదుపులో మణిపూర్ పరిస్థితి.. మరిన్ని బలగాలు మోహరింపు..
వివరాల్లోకి వెళితే.. బాపట్ల జిల్లా కర్లపాలెం పాత ఇస్లాంపేటకు చెందిన సుభానీ, సుభాంబీ భార్యాభర్తలు.. వారిద్దరికి ఓ కుమారుడు ఉన్నాడు. సుభాని రైస్ మిల్లులో పనిచేస్తాడు.. అలాగే కుట్టుపని చేస్తూ కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. సుభాంబీ ఇంట్లోనే ఉంటుంది. సుభానీ రోజు మద్యం తాగుతాడు. అనంతరం రోజూ రాత్రిళ్లు ఇంటికి వచ్చి భార్యను దారుణంగా వేధించేవాడు. తండ్రి సుభాని తల్లిని రోజూ కొట్టడం చూసి తొమ్మిదేళ్ల కుమారుడు రహీమ్ తట్టుకోలేకపోయాడు. తల్లి బాధను చూడలేకపోయాడు. తండ్రి ఇలా చేయకుండా చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే నేరుగా స్థానిక పోలీసుస్టేషన్‌కు వెళ్లాడు. తన తల్లితో తండ్రి ప్రవర్తిస్తున్న తీరును ఎస్సైకు వివరించాడు. వెంటనే తండ్రి చేస్తున్న పని ఆపించాలని వేడుకున్నాడు. అతడిని పిలిచి మందలించాలని ఎస్సైను కోరాడు.
Read Also:SRH vs KKR : ప్రతీకారం తీర్చుకున్న కేకేఆర్.. పోరాడి ఓడిన సన్ రైజర్స్
బాలుడి ఫిర్యాదుతో ఎస్సై వెంటనే ఆ దంపతులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటివి పునరావృతం అయితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించి అక్కడిన నుంచి పంపించేశారు. మొత్తానికి బాలుడు తన తల్లి పడుతున్న కష్టాన్ని చూడలేక పోలీస్ స్టేషన్‌కు వచ్చి తండ్రిపై ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.
