Karimnagar Drought: కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి.. రైతులకు నష్టపరిహారం చెల్లించాలి!

Karimnagar Drought Demand

Karimnagar Drought Demand

Karimnagar Drought Demand: తెలంగాణలో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వెంటనే కరీంనగర్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులను ఆదుకోవాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నాయకుడు చాడ వెంకటరెడ్డి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సరైన వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులను ఆదుకోవాలని గతంలోనే సీపీఐ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వినతిపత్రం అందజేసినట్లు చాడ వెంకటరెడ్డి గుర్తుచేశారు. కరీంనగర్ జిల్లాలోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వెంటనే జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సాధారణ పంటలకు ఎకరాకు రూ.30 వేల చొప్పున, పత్తి పంటకు ఎకరాకు రూ.50 వేల చొప్పున, కూరగాయల పంటలకు ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.

కరీంనగర్ జిల్లాలో తాగునీటి సమస్య కూడా తీవ్రంగా మారుతోందని చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం కాకుండా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు పంట నష్టపరిహారం అందించడంతో పాటు ప్రజల తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించి నష్టపరిహారం అందించే చర్యలు చేపట్టాలని సీపీఐ నాయకులు కోరారు.