ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖపట్నం నేతల రాజకీయాలు రంజుగా మారాయి. నిన్న రాత్రి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ఇంట్లో పలువురు కాపు నేతల భేటీ హాట్ టాపిక్ అవుతోంది. గంటా నివాసంలో జరిగిన భేటీలో బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ నేత బోండా శ్రీనివాసరావు పాల్గొన్నారు. విజయవాడలో ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు వచ్చి సమావేశమైన నేతలు పలు అంశాలు చర్చించారని తెలుస్తోంది. నాదెండ్ల-కన్నా భేటీ, గంటా పార్టీ మార్పు ప్రచారంపై నేతల మధ్య ప్రస్తావనకు వచ్చిందని అంటున్నారు.
తాను పార్టీ మారుతున్నాననే అంశం మీడియా ప్రచారమే తప్ప వేరేదేం లేదన్నారు గంటా శ్రీనివాసరావు. నాదెండ్లతో భేటీ జరిగిందని.. తాజా రాజకీయాలపై చర్చించుకున్నామని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కాపు నేతల భేటీ జరిగి ఉంటే.. మాతో పాటు చాలా మంది కూర్చొనేవారంటున్నారు నేతలు. ఈభేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదంటున్నారు నేతలు. మరోవైపు అది కేవలం లంచ్ మీటింగ్ అంటున్నారు నేతలు.
Read Also: Ashwini Vaishnaw: వృద్ధులకు రైల్వే మంత్రి షాక్.. రాయితీలేనట్లే..
మాజీ మంత్రి వెల్లంపల్లి కుమార్తె పెళ్లికి వెళ్లి ఆ తరువాత కలిశారని తెలుస్తోంది. రెగ్యులర్ పొలిటికల్ చర్చ తప్ప ఏ మాత్రం ప్రత్యేకత లేదని గంటా అంటున్నారు. “నేను పార్టీ మారడానికి వీళ్ళతో చర్చించాల్సిన అవసరం ఏముంది- హడావిడి కోసం పెట్టే వ్యవహారం అంటున్నారు. అధికారం వున్న పార్టీలో ఎక్కువగా గంటా వుంటారనే విమర్శలు వున్నాయి. తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యం, ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి మళ్లీ తెలుగుదేశం, ఇప్పుడు తెలుగుదేశం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆయన త్వరలో అధికార పార్టీ వైసీపీలో చేరబోతున్నారని, ఆయనకు జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తానేం పార్టీ మారడం లేదంటున్నారు గంటా శ్రీనివాసరావు.
ఇటీవల కాపునాడు అంటూ ఓ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు గంటా శ్రీనివాసరావు. డిసెంబరు 26 వంగవీటి రంగా వర్థంతిని పురస్కరించుకొని రాధా-రంగా రాయల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కాపునాడు జరగబోతోంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను ఆయన ఆవిష్కరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాపుల అభివృద్ధి కోసం ఏ కార్యక్రమం పెట్టినా తాను ముందుంటానన్నారు. దీంతో రాజకీయ విశ్లేషకులంతా గంటా శ్రీనివాసరావు ఈసారి వంగవీటి రంగా పేరుతో కీలకం కాబోతున్నారని కామెంట్లు వస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో కాపుల ఓట్లే కీలకం కాబోతున్నాయి. కాపు నేతలకు కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది. అటువైపుగా తన రాజకీయాన్ని తిప్పబోతున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Read ALso: Ashwini Vaishnaw: వృద్ధులకు రైల్వే మంత్రి షాక్.. రాయితీలేనట్లే..