తెలంగాణ కాంగ్రెస్ లో నేతల మధ్య విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా కామారెడ్డి కాంగ్రెస్ లో నేతల మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి. ఇరువర్గాల నేతలు ఘర్షణలకు దిగారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలోనే ఈ ఘటన జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హాత్ సే హాత్ జోడో యాత్రను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాదయాత్ర కామారెడ్డి జిల్లాలో కొనసాగుతుంది. అయితే ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రేవంత్ రెడ్డి పాదయాత్ర క్యాంపు వద్ద మదన్ మోహన్, సుభాష్ రెడ్డి వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది కాస్తా ఘర్షణకు దారితీసింది.
Also Read : Jairam Ramesh: కాంగ్రెస్ లేకుండా బీజేపీని ఎదుర్కోవడం ఏ ఫ్రంట్‌కు సాధ్యం కాదు..
మదన్ మోహన్ వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజును లోనికి వెళ్లకుండా సుభాష్ రెడ్డి అడ్డుకోవడంతో వివాదం ప్రారంభమైంది. కొద్దిసేపట్లోనే అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీ ఇరువర్గాలను అదుపు చేసే ప్రయత్నం చేసిన లాభం లేకుండా పోయింది. అయితే రేవంత్ రెడ్డి పాదయాత్ర క్యాంప్ వద్దే నాయకుల మధ్య విభేదాలు ఈ స్థాయిలో బహిర్గతం కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Also Read : TSPSC : పేపర్ లీక్ లో సంచలన విషయాలు.. వాట్సప్ చాట్ లో కొత్త లింకులు
గత కొంతకాలంగా మదన్ మోహన్, సుభాష్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు తారా స్థాయిలో కొనసాగుతూనే ఉన్నాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను సుభాష్ రెడ్డి వర్గం చూసుకుంటుంది. అయితే సుభాష్ రెడ్డి వర్గంపై మదన్ మోహన్ వర్గం గుర్రుగా ఉంది. సుభాష్ రెడ్డి వర్గానికి రేవంత్ రెడ్డి కొమ్ముకాస్తున్నారని మదన్ మోహన్ వర్గం ఆరోపిస్తుంది. ఈ వివాదంపై మరి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఏ విధంగా స్పందింస్తుందో చూడాలి.