NTV Telugu Site icon

America: అమెరికాలో దీపావళి.. వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారిస్‌ నివాసంలో ఘనంగా వేడుకలు

Kamala Harris

Kamala Harris

America: అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారిస్‌ అధికారిక నివాసంలో శుక్రవారం దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. కమలా హారిస్ తమ భర్తతో కలిసి వాషింగ్టన్‌లోని తమ నివాసంలో దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 24న దీపావళి జరుపుకోనుండగా.. భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ముందస్తు వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున ఇండో అమెరికన్లు పాల్గొన్నారు. మట్టి ప్రమిదలతో దీపాలను వెలిగించి.. మతాబులను కాల్చారు.

అమెరికా ఉపాధ్యక్షురా కమలా హారిస్ దీపావళి పండుగతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సంస్కృతుల పరిధులకు అతీతమైన సార్వత్రిక భావన దీపావళి అని తెలిపారు. అంధకారంపై వెలుగు ప్రభావం నుంచి స్ఫూర్తిని పొందడానికి సంబంధించిన పండుగ అని వివరించారు. దీపావళి పండుగ భారత్‌కు మాత్రమే కాదని.. అన్ని దేశా సంస్కృతులకూ వర్తిస్తుందని ఆమె అన్నారు. హ్యాపీ దీపావళి అంటూ కాకరవత్తులు కాల్చుతూ హారిస్‌ సందడి చేశారు. చీకటిపై వెలుగు సాధించే విజయాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. చీకటి ఉన్న ప్రతి చోట వెలుగులు ప్రసరించాలన్నారు.

వచ్చిన అతిథులకు ఇండియన్‌ స్వీట్స్‌తో పాటు మరికొన్ని స్పెషల్ ఐటమ్స్‌ను వడ్డించారు. వీటిలో పానీపూరీ కూడా ఉండటం విశేషం. 100 మందికి పైగా ఇండియన్ అమెరికన్స్ ఆమె అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు. ‘‘అమెరికా ఉపాధ్యక్షురాలిగా నేను దీని గురించి చాలా ఆలోచిస్తాను, ఎందుకంటే, ప్రపంచంలో, మన సొంత దేశంలో గొప్ప సవాళ్లు లేకుండా మనం లేము, అంధకారం అలముకున్న క్షణాల్లో వెలుగును నింపడానికి మనకు గల శక్తి ప్రాధాన్యాన్ని మనకు గుర్తు చేసే పండుగ దీపావళి’’ అని కమల హారిస్ వివరించారు.