కల్పనా సోరెన్ పరిచయం అక్కర్లేని పేరు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్యగా చాలా ప్రాచుర్యం పొందారు. ఇక హేమంత్ జైలుకు వెళ్లాక.. మీడియాలో ఆమె పేరు బాగా మార్మోగింది. మనీలాండరింగ్ కేసులో హేమంత్ జైలుకెళ్లారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా కల్పనా సోరెన్‌కు బాధ్యతలు అప్పగిస్తారని అంతా భావించారు. కానీ చివరిలో తోటి కోడలు సీతా సోరెన్.. ఆ ప్రతిపాదనను అడ్డుకున్నారు. దీంతో ఆమె ఆశలు ఆవిరయ్యాయి. ఇక తాజాగా జరిగిన అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించారు. గాండే ఉప ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థి కల్పనా సోరెన్ 27,159 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి దిలీప్ కుమార్ వర్మపై విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీకి చెందిన దిలీప్ కుమార్ వర్మకు 82,678 ఓట్లు రాగా.. కల్పనాకు 1.09 లక్షల ఓట్లు వచ్చాయి.
కల్పనా M.Techతో పాటు MBA చదివారు. మార్చి 2024లో రాజకీయాల్లోకి రాకముందు ఆమె గృహిణిగా ఉన్నారు. JMM ఎమ్మెల్యే సర్ఫరాజ్ అహ్మద్ రాజీనామా చేయడంతో గాండే అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఆ స్థానం నుంచి కల్పనా సోరెన్ పోటీ చేసి విజయం సాధించారు. ఇదిలా ఉంటే హేమంత్ వారసుడిగా ప్రస్తుతం సీఎం కుర్చీలో చంపయ్ సోరెన్ ఉన్నారు. తాజాగా కల్పనా సోరెన్ విజయం సాధించడంతో తిరిగి ముఖ్యమంత్రి పీఠం.. హేమంత్ సోరెన్ కుటుంబానికే దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Satyabhama: దర్శకత్వం అమ్మలాంటి పని.. నిర్మాతగా ఉండటం నాన్న లాంటి బాధ్యత: శశికిరణ్ తిక్క ఇంటర్వ్యూ
ఇదిలా ఉంటే మనీలాండరింగ్ కేసులో జనవరి 29న హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన జైల్లో ఉంటున్నారు. ఇక బెయిల్ పిటిషన్లను కోర్టులు తిరస్కరించాయి.
ఇది కూడా చదవండి: Chandrababu: చంద్రబాబు నివాసం వద్ద కార్యకర్తల కోలాహలం
