Site icon NTV Telugu

Kakani Govardhan Reddy: వ్యవసాయం అంటే ఏమాత్రం ఇష్టం లేని వ్యక్తి చంద్రబాబు!

Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy

వ్యవసాయం అంటే ఏమాత్రం ఇష్టం లేని వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అని మాజీమంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి విమర్శించారు. రైతుల కష్టాలు తీర్చటానికి కూటమి ప్రభుత్వం ముందుకు రాలేదని, చంద్రబాబు పుణ్యమా అని రైతులు తీవ్ర నష్టాల ఊబిలో కూరుకుపోయారన్నారు. యూరియా కోసం రైతులు పడే అగచాట్లు ఈ ప్రభుత్వ పెద్దలకు కనపడటం లేదా? అని ప్రశ్నించారు. గతంలో కంటే ఎక్కువ తెచ్చామని చెప్తున్న యూరియా ఏమైంది?, రైతులకు అందాల్సిన యూరియా బ్లాక్ మార్కెట్‌లోకి ఎలా వెళ్లింది? అని నిలదీశారు. రైతులను అవమానపరిచేలా ధాన్యం తినటానికి పనికి రాదని చెప్పారని, ధాన్యాన్ని కేవలం ఆల్కాహాల్ తయారీకే వాడతారని చెప్పటం సిగ్గుచేటు అని కాకాణి మండిపడ్డారు.

‘రైతులకు సంబంధించి అసెంబ్లీలో సీఎం చంద్రబాబు సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. ఇంతవరకు వ్యవసాయం గురించి ఒక్క సమీక్ష నిర్వహించని సీఎం, వ్యవసాయ మంత్రి.. రాష్ట్రంలో రైతుల పరిస్థితి బాగా ఉంది అనేలా వారి మాటలు ఉన్నాయి. రైతులు అసలు సమస్యల్లో లేరని ముక్తాయించిన చంద్రబాబు.. యూరియా ఇవ్వలేకపోవటం ప్రభుత్వ వైఫల్యం అనే విషయాన్ని అంగీకరించలేకపోతున్నారు. యూరియా వాడిన వంటలు తింటే క్యాన్సర్ వస్తుందనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్ కూడా నేనే తెచ్చా అని చెప్పారు. మన రాష్ట్రంలో డ్రిప్ సిస్టం 1991లోనే ప్రారంభమైంది. మీరు ముఖ్యమంత్రి అయ్యింది 1995లో, అయినా నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారు. దేశానికి కూడా నేనే డ్రిప్ ఇరిగేషన్ పరిచయం చేశానని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. మధ్యాహ్నం భోజనం విషయంలో కూడా గొప్పలు చెప్పుకున్నారు. మీ హయాంలో ఎంత గిట్టుబాటు ధరలు ఉన్నాయి.. వైసీపీ హాయంలో ఎలా ఉన్నాయో కనుక్కుని మాట్లాడాలి. ధాన్యం సహా అన్నీ పంటల గిట్టుబాటు ధరలు దిగజారాయి. మిర్చి, పొగాకు రైతులు కోలుకునే పరిస్థితి లేదు. క్వింటా ఉల్లి 300 కూడా పడక రైతులు అల్లాడుతున్నారు. టమోటా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రైతుల గురించి ఆలోచించే దమ్మున్న నాయకుడు జగన్ పాలనలో ధరలు ముందే ఫిక్స్ చేసి ఇచ్చారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నారు. సోమశిల కండలేరు కింద రెండవ పంటకు నీళ్లిచ్చాం.. అందుకే యూరియా కొరత ఏర్పడిందని చెప్పుకుంటున్నారు. మీరు తెలిస్తే మాట్లాడాలి.. లేకపోతే ఊరికే కూర్చోవాలి. జగన్ సీఎంగా ఉన్న కాలంలో నెల్లూరు జిల్లాలో రెండవ పంటకు నీళ్లిచ్చాం. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సమాచారం తెలియకుండా మాట్లాడకూడదు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా పట్టలేని దిక్కుమాలిన స్థితిలో ఉన్న ప్రభుత్వం.. అన్నదాత సుఖీభవ మొత్తం ఇచ్చానని అబద్ధాలు చెప్తున్నారు’ అని కాకాణి మండిపడ్డారు.

Also Read: CM Chandrababu: ఐటీ గురించి కాదు.. రైతుల కోసమే ఎక్కువగా ఆలోచిస్తా!

‘మీకు చిత్తశుద్ధి ఉంటే సరైన సామర్థ్యంతో నీటిని కూడా అందించలేకపోతున్నారు. యూరియా కర్ణాటక, తెలంగాణలో కూడా షార్టేజ్ వచ్చింది అని చెప్తున్నారు. రైతుల యూరియా కష్టాలు మీకు కనిపించటం లేదా. రైతుల కన్నా మీరు వ్యవసాయంలో నిష్ణాతులా. యూరియా కొరతకు ఎక్కువ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం వల్ల సమస్య వచ్చింది అని చెప్పారు. ఇప్పుడు నాలుక మడత పెట్టి అబద్ధాలు చెప్తున్నారు. ఏమి ఆశించి మీరు రైతులకు కాకుండా వ్యాపారులకు యూరియా ఇచ్చారు. రైతులు అడిగినంత కాకుండా.. మేమే పరీక్షలు చేసి మీకు అవసరం అయినంత ఇస్తా అంటున్నారు. సమస్యను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప పరిష్కరించే ప్రయత్నం చేయని ప్రభుత్వం. రైతుల పేరుచెప్పి దోచుకోవటం తప్ప మరొకటి లేదు. యూరియా సమస్య మీద ఇంతవరకు ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదు. కూటమి ప్రభుత్వం మీద అమెరికా నుంచి 800 సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టారు అంటున్నారు వాళ్లకు ఇక్కడ కుటుంబాలు ఉండవా. 100 జన్మలు ఎత్తినా జగన్ లా మీరు రైతుల గురించి ఆలోచించలేరు. ఇన్ పుట్ సబ్సిడీ పేరుతో రైతులకు డబ్బులు ఎగ్గొట్టారు. రానున్న రోజుల్లో యూరియా కష్టాలు రైతులకు మరింత పెరిగే అవకాశం ఉంది. వ్యవసాయం అంటే ఏమాత్రం ఇష్టం లేని వ్యక్తి చంద్రబాబు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన వ్యక్తి జగన్. రైతుల కష్టాలు తీర్చటానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. రైతుల కష్టాలు ఎలా ఉన్నాయో స్వయంగా చూపిస్తాం. మాతో కలిసి రైతుల దగ్గరకు వచ్చే దమ్ము ప్రభుత్వ పెద్దలకు ఉందా?. వైసీపీ రైతుల కోసమే పోరాడుతుంది. పశువులకు హాస్టల్ పెట్టటం కాదు, పాల ధరకు గిట్టుబాటు ధర ఇస్తే చాలు’ అని మాజీమంత్రి కాకాణి ఫైర్ అయ్యారు.

Exit mobile version