OTR: కదిరి వైసీపీలో కోవర్ట్ కలకలం.. పార్టీని దెబ్బతీస్తున్నది సొంత నేతలేనా?

Kadiri

Kadiri

OTR: నువ్వు తిట్టినట్టు నటించు.. నేను ఏడ్చినట్టు నటిస్తా.. రాజకీయాల్లో ఇలాంటి అండర్‌స్టాండింగ్స్‌ సహజమే అయినా.. ఆ నియోజకవర్గంలో ఇంకాస్త ఎక్కువ అన్నట్టుగా ఉందా? లోకల్‌ వైసీపీ నేతలు కాస్త డిఫరంట్‌గా మేమే గిల్లుతాం, మేమే జోలపాడతాం అన్నట్టు వ్యవహరిస్తున్నారా? అందుకోసం సొంత పార్టీలోనే ఒక నెగెటివ్‌ భజన బృందాన్ని పెంచి పోషిస్తున్నారా? ఎక్కడుందా పరిస్థితి? డబ్బులిచ్చి మరీ తిట్టించుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది?

ఎంతటి ఘరానా దొంగల్ని అయినా.. పట్టుకోవచ్చుగానీ.. ఇంటి దొంగల్ని మాత్రం ఈశ్వరుడు కూడా పట్టలేడంటారు. ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం వైసీపీలో పరిస్థితి ఇలాగే ఉందట. కొందరు మా వాళ్లే గోతులు తవ్వుతూ పార్టీని అందులో కప్పెట్టే ప్లాన్‌లో ఉన్నారని కేడర్‌ కాస్త ఘాటుగానే రియాక్ట్‌ అవుతోంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. వైసీపీకి అత్యంత బలం ఉన్న ఏరియాల్లో కదిరి నియోజకవర్గం కూడా ఒకటి. పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ మూడు సార్లు ఎన్నికలు జరిగితే.. 14, 19లో భారీ మెజార్టీతో ఈ సీటు దక్కించుకుంది.

ఒక్క 2024ఎన్నికల్లో మాత్రం ఓటమి ఎదురైంది. అప్పుడు పార్టీ అభ్యర్థి మక్బూల్ ఓటమికి సొంత పార్టీ నేతలే కారణం అన్న ఆరోపణలున్నాయి. అయితే…అది జరిగి రెండేళ్లు గడిచాక ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారన్న ప్రశ్నకు కారణాలు బలంగానే ఉన్నాయన్నది కేడర్‌ ఆన్సర్‌. అసలు మక్బూల్ ఓటమి దగ్గర నుంచే కోవర్ట్‌ కుట్రలపై కొందరు నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కదిరి నియోజకవర్గంలో వైసీపీని కూటమి పార్టీలకంటే ఎక్కువగా మా వాళ్ళే దెబ్బ తీస్తున్నారని అంటున్నారు ద్వితీయ శ్రేణి నాయకులు. అలాంటి వాళ్ళంతా ఒక నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుని మరీ కుట్రలు చేస్తున్నారన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఇటీవల నియోజకవర్గ నాయకులు పూల శ్రీనివాస్ రెడ్డి, మక్బూల్ మధ్య ఇంటర్నల్ వార్ నడుస్తోంది.

ఈసారి నాకు టికెట్ రాకపోతే సహకరించేదే లేదని ఇప్పుడే తేల్చి చెప్పారట శ్రీనివాస్ రెడ్డి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కుట్ర సిద్ధాంతాలు తెరపైకి వస్తున్నాయి. కొందరు వైసీపీ నాయకులు కోవర్ట్‌ల గురించి నేరుగా ప్రస్తావించకుండా పరోక్షంగా సంకేతాలు ఇస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వాళ్ళు ఎప్పుడూ పాజిటివ్ దృక్పథంతో ఉండరని.. వాళ్ళ మెదడులో ఉండేవన్నీ నెగెటివ్ థాట్స్.. నెగిటివ్ థింకింగ్.. నెగిటివ్ వర్కింగ్.. పార్టీ డామేజ్.. అంటూ పోస్టులు పెడుతున్నారు. అంతకన్నా వీళ్లు చేసేది ఏమీ ఉండదని.. చేతనైంది కూడా ఏమీ లేదంటున్నారు. వాస్తవంగా నియోజకవర్గంలో కూటమి నాయకులు సైలెంట్‌గా ఉంటే.. మా పార్టీలోని ఆ కోవర్టు బ్యాచ్ వాళ్ల వద్దకు వెళ్ళి వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారంటూ పేర్లు ప్రస్తావించకుండా పెడుతున్న పోస్టింగ్స్‌ కలకలం రేపుతున్నాయి.

ఇంటర్నల్‌ సీక్రెట్స్‌ని కూడా కూటమి నాయకులకు లీక్‌ చేస్తూ…ఎలా మాట్లాడాలో కూడా వైసీపీ వాళ్ళే లీడ్‌ చేస్తున్నారన్నది అంతర్గతంగా చెప్పుకుంటున్న మాట. పైగా.. వీళ్ళు ఇచ్చిన లీడ్‌ ప్రకారం కూటమి నాయకులు చెలరేగి మాట్లాడుతుంటే… ఆ ఇన్ఫర్మేషన్‌ ఇచ్చిన వైసీపీ నాయకులే తిరిగి తమవాళ్ళను కార్నర్‌ చేస్తూ రక్తి కట్టిస్తున్నారట. అధికార పక్షం నుంచి అంతలా టార్గెట్‌ చేస్తుంటే మనవాళ్ళు ఏమీ మాట్లాడ్డం లేదు, వీళ్ళు అసలు ఎందుకు కామ్‌గా ఉంటున్నారంటూ తిరిగి రెచ్చగొడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. దీంతో అసలు ఈ కోవర్టులు ఎవరన్న దానిపై కదిరిలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. అది అందరికీ తెలియకున్నా… చేసే వారికే బాగా తెలుసునన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. అదే సమయంలో అలాంటి వాళ్ళని కార్యకర్తలు” చీదరించుకొని ఛీ కొట్టే లోపే” మారాలని కూడా సలహాలు ఇస్తున్నారు.