YS Jagan Mohan Reddy: స్టీల్ ప్లాంట్ పనులు మొదలు.. X వేదికగా జగన్ కీలక వ్యాఖ్యలు.!

Ys Jagan Mohan Reddy

Ys Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: కడప ఉక్కు కర్మాగార ప్రాజెక్ట్ పనులు తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎక్స్ X వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్ట్ పునఃప్రారంభాన్ని స్వాగతిస్తూ.. JSW స్టీల్ చైర్మన్ సజ్జన్ జిందాల్‌తో పాటు మొత్తం సంస్థ బృందానికి అభినందనలు తెలిపారు.

రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధిలో కడప స్టీల్ ప్లాంట్ కీలక మైలురాయిగా నిలుస్తుందని జగన్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి కూడా ఊతం లభిస్తుందని అన్నారు. ఎంతోకాలంగా ఉద్యోగాలు, పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఈ ప్రాజెక్ట్ ఆశాకిరణంగా మారుతుందని పేర్కొన్నారు. ఇలాంటి భారీ ప్రాజెక్టులు ఒక్కరోజులో కార్యరూపం దాల్చవని, వాటి వెనుక ఎన్నో ఏళ్లపాటు సాగిన కృషి ఉంటుందని జగన్ గుర్తు చేశారు. తమ ప్రభుత్వ హయాంలోనే JSW సంస్థను ప్రాజెక్ట్ డెవలపర్‌గా ఎంపిక చేసి, ప్రాజెక్ట్ అమలుకు అవసరమైన కీలక పునాదులను సిద్ధం చేశామని తెలిపారు.

పర్యావరణ అనుమతులు, నీటి కేటాయింపులు, భూకేటాయింపు, రహదారి సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన భూముల సమీకరణ వంటి కీలక అంశాలను తమ ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పారు. ఈ చర్యల వల్లే ప్రాజెక్ట్ పనులు తమ హయాంలో వేగంగా ముందుకు సాగాయని పేర్కొన్నారు. అయితే గత రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తిగా నిలిచిపోయాయని జగన్ విమర్శించారు. దీంతో ప్రాంత ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పెట్టుబడి ప్రాజెక్ట్ అమలులో జాప్యం జరిగిందన్నారు. ప్రస్తుతం పనులు తిరిగి ప్రారంభం కావడం సంతోషకరమని, ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రాజెక్ట్ పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు.

కడప తన సొంత జిల్లా కావడంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని జగన్ పేర్కొన్నారు. అక్కడి యువతకు పారిశ్రామిక వృద్ధి, స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు. అభివృద్ధి అనేది రాజకీయాలకు అతీతమైన నిరంతర ప్రక్రియ అని, ప్రజల ప్రయోజనాల కోసం ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులను పూర్తి చేయడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని వ్యాఖ్యానించారు. చివరగా, కడప స్టీల్ ప్లాంట్ పనులను వేగంగా పూర్తి చేయడంలో JSW సంస్థ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా కడప జిల్లా ప్రజలతో పాటు మొత్తం రాయలసీమ ప్రాంతానికి ఉపాధి, పారిశ్రామికాభివృద్ధి, సమగ్ర వృద్ధి ఫలాలు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.