MP YS Avinash Reddy Arrest: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వ్యవహారం ఉద్రిక్తతలకు దారితీసింది. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ల విషయంలో వివాదం చోటుచేసుకుంది. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు నామినేషన్ల స్వీకరణలో జాప్యం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మూడు రోజులుగా పలుమార్లు నామినేషన్ కేంద్రానికి వెళ్లినా అభ్యర్థులను నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని అంకాలమ్మగూడూరు సర్పంచ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ మురళి నాయక్‌ను కలిసి తమ సమస్యలను అభ్యర్థులు వివరించారు. పోలీసుల తీరును నిరసిస్తూ డీఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అభ్యర్థుల వెంట కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. అభ్యర్థులకు భద్రత కల్పించి, ఎలాంటి అడ్డంకులు లేకుండా నామినేషన్లు దాఖలు చేసుకునేలా చూడాలని డీఎస్పీని కోరారు.
డీఎస్పీ కార్యాలయం వద్ద అవినాష్ రెడ్డి నిరసన
నామినేషన్ల దాఖలుకు టీడీపీ నాయకులు అడ్డంకులు సృష్టిస్తే మరోసారి డీఎస్పీ కార్యాలయం ఎదుటే ధర్నా చేస్తామని అవినాష్ రెడ్డి హెచ్చరించారు.. ఇదే సమయంలో డీఎస్పీ మురళి నాయక్ తీరును వ్యతిరేకిస్తూ వైసీపీ నేతలు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. డీఎస్పీ కార్యాలయం వద్ద కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యాలయం నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన అవినాష్ రెడ్డిని డీఎస్పీ మురళి నాయక్ అడ్డుకున్నారు.. ఈ పరిణామాల మధ్య కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు ప్రివెంటివ్ అరెస్ట్ చేసినట్లు సమాచారం. సుమారు 70 వాహనాల్లో చక్రాయపేటకు వెళ్లిన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అవినాష్ రెడ్డితో పాటు దుష్యంత్ రెడ్డి పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు..
పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా వైసీపీ శ్రేణులు
అవినాష్ రెడ్డి అరెస్ట్ వార్త తెలియడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంటున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు సింహాద్రిపురం ప్రాంతానికి చెందిన వైసీపీ సానుభూతిపరులైన సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తున్న సమయంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి పులివెందుల నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నామినేషన్ల దాఖలాపై మొదలైన వివాదం ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ వరకు వెళ్లడంతో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసుల తదుపరి చర్యలు, అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణపై ఉత్కంఠ నెలకొంది.

