నటి, మోడల్ షఫాలీ జరివాలా (42) గుండె పోటుతో మరణించారు. షఫాలీ జరివాలా శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురికాగా.. వెంటనే ఆమె భర్త పరాగ్ త్యాగి అంధేరిలోని బెల్లేవ్యూ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం కోసం షఫాలీ మృతదేహాన్ని కూపర్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ విషయాన్ని షఫాలీ కుటుంబ సభ్యులు ఇంకా ధ్రువీకరించలేదు.
2002లో విడుదలైన ఐకానిక్ మ్యూజిక్ వీడియో ‘కాంటా లగా’తో షఫాలీ జరివాలా ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. ఆ సాంగ్‌తో కుర్రకారు మదిని దోచేశారు. దాంతో ఆమెను కాంటా లాగా గర్ల్‌గా పిలవడం ప్రారంభించారు. సాంగ్ అనంతరం సల్మాన్ ఖాన్ ‘ముజ్సే షాదీ కరోగా’ చిత్రంలో షఫాలీ ఓ పాత్ర చేశారు. ఆపై పలు టీవీ రియాలిటీ షోలు చేశారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హిందీ బిగ్‌బాస్ 13లో పాల్గొన్నారు. రియాలిటీ షో ‘నాచ్ బలియే’ సీజన్ 5లో పాల్గొన్నారు.
షఫాలీ జరివాలా 1982 డిసెంబర్ 15న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించారు. ఆమె తండ్రి పేరు సతీష్ జరీవాలా, తల్లి పేరు సునీతా జరీవాలా. 2014లో షెఫాలీ టీవీ సీరియల్ నటుడు ప్రాగ్ త్యాగిని వివాహం చేసుకున్నారు. మూడు రోజుల క్రితం షఫాలీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చివరి పోస్ట్ చేశారు. అందులో ఆమె తన ఫొటోస్ పోస్ట్ చేసి.. ‘బ్లింగ్ ఇట్ ఆన్ బేబీ’ అనే క్యాప్షన్ ఇచ్చారు. షఫాలీ మృతి పట్ల ప్రముఖ గాయని మికా సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సంతాపం వ్యక్తం చేశారు.
