NTV Telugu Site icon

Kavitha: కవితకు దొరకని ఊరట.. బెయిల్‌పై తీర్పు రిజర్వ్

Kavitha

Kavitha

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు న్యాయస్థానంలో ఊరట లభించలేదు. ఆమె బెయిల్‌పై మంగళవారం ఈడీ, సీబీఐ వాదనలు ముగిశాయి. సోమవారం కవిత తరపున వాదనలు ముగిశాయి. వాదనలు అనంతరం జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెయిల్‌పై తీర్పును రిజర్వ్ చేశారు.

కవితకు బెయిల్ ఇవ్వద్దని ఈడీ, సీబీఐ వాదనలు వినిపించాయి. బెయిల్ ఇస్తే సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని తెలిపాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అక్రమ సొమ్ము నేరుగా కవితకు చేరిందని ఈడీ వాదించింది. కేసులో కవిత కీలక పాత్రధారి అని.. దీనికి వాట్సాప్ చాట్, ఇతర ఆధారాలు ఉన్నాయని పేర్కొంది.

 

కవిత తరపు వాదనలు..

ఈ కేసులో బుచ్చిబాబును నిందితుడిగా చేర్చక పోవడం, అరెస్టు చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని కవిత తరపు న్యాయవాది నితీష్ రానా కౌంటర్ వాదనలు వినిపించారు. బుచ్చి బాబు స్టేట్‌మెంట్లు కోర్టు పట్టించు కోవద్దని.. ఆగస్టు 2023 తర్వాత ఎలాంటి కొత్త సాక్ష్యాలు ఈడీ చూపించలేదని తెలిపారు. సాక్ష్యాల ధ్వంసం చేసిన సమయంలో ఎందుకు అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. కవిత తన ఫోన్లు పని మనుషులకు ఇచ్చారని.. రూ. 190 కోట్ల అక్రమ సొమ్ము చేరిందన్న ఈడీ వాదనలో నిజం లేదని… ఒక్క పైసా కూడా కవిత ఖాతాకు చేరలేదని తెలిపారు. దీనిపై ఎలాంటి సాక్ష్యాలు ఈడీ చూపలేదన్నారు. కవిత అరెస్ట్ విషయంలో సీబీఐ చట్ట ప్రకారం నడుచుకోలేదని.. కవిత అరెస్ట్‌కు సీబీఐ కారణాలు చెప్పలేదని కవిత న్యాయవాది స్పష్టం చేశారు.

 

ఈడీ వాదనలు..
లిక్కర్ కేసులో కవిత కింగ్ పిన్ అని ఈడీ తరపు న్యాయవాది జోహెబ్ హుసేన్ వాదనలు వినిపించారు. ‘‘లిక్కర్ కేసులో అక్రమ సొమ్ము కవితకు చేరింది. దీనికి సంబంధించిన వాట్సప్ చాటింగ్‌లు మా వద్ద ఉన్నాయి. ‘‘ఇండియా ఎహెడ్” టీవీ ఛానల్ లో పెట్టుబడి పెట్టారు. ఫోన్లో డేటాను ధ్వంసం చేశారు. విచారణకు ముందే ఫోన్ సాక్షాలు ధ్వంసం చేశారు. ఈడీకి ఇచ్చిన ఫోన్ల డేటాను ఫార్మాట్ చేసినట్టు ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చింది. డిజిటల్ డేటా ధ్వంసంపై 19 పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. కవిత‌కు బెయిల్ ఇవ్వొద్దు. సూర్యాస్తమయానికి ముందే కవితను అరెస్టు చేశాం. ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదు. గోప్యత హక్కును భంగపరచలేదు.’’ అని ఈడీ పేర్కొంది.

 

సిబీఐ వాదనలు..
మద్యం విధానంపై కవితను కలవాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్యం వ్యాపారికి చెప్పారు. భూములు, హవాలా మార్గం ద్వారా అక్రమ సొమ్ము రవాణా జరిగింది. ఈ కేసులో కవిత పాత్రపై అనేక సాక్షాలు, వాంగ్మూలాలు ఉన్నాయి. అందుకే కవిత అరెస్టు తప్పనిసరి. మహిళ అయినంత మాత్రాన బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ లిక్కర్ కేసులో కవితనే ప్రధాన లబ్ధిదారు. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షాలు ధ్వంసం చేస్తుంది. సాక్షులను ప్రభావితం చేస్తుంది. కవితకు కొత్త ఆరోగ్య సమస్యలు ఏవీ లేవు. సీబీఐ కేసులో బుచ్చిబాబును అరెస్టు చేశాం. ఆయనపై చార్జిషీట్ కూడా దాఖలు చేశాం.’’ అని సీబీఐ వాదనలు వినిపించింది.