తెలంగాణలో ఉత్కంఠ రేకెత్తిస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంకు నేడు తెరపడనుంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి గడువు ముగియనుంది. సాయంత్రం 5 తర్వాత మైకులు, నేతల ప్రచారాలు బంద్ కానున్నాయి. సాయంత్రం నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆంక్షలు మొదలుకానున్నాయి. నియోజకవర్గంలో 144 సెక్షన్ అమల్లోకి వస్తుంది. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా.. 14న ఫలితాలు వెల్లడికానున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇంతమంది పోటీలో ఉన్నా ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్యనే పోటీ నెలకొంది. అధికార కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా గట్టి పట్టుగా ఉంది. నేటితో ప్రచారం ముగియనుండటంతో.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు హోరాహోరీ ప్రచారం చేయనున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రధాన నేతలు ప్రచారంలో దిగుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుండగా.. అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. ఇక బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో సాయంత్రం 5 తర్వాత 144 సెక్షన్ అమల్లోకి వస్తుంది. ప్రజా శాంతి, భద్రత కోసం సెక్షన్ 144 అమల్లో ఉంచుతూ ఆదేశాలు జారీ చేశారు సీపీ సజ్జనార్. 5 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒకేచోట గుమికూడడం నిషేధం. పోలింగ్ జరిగే నవంబర్ 11న ఉదయం 6 గంటల నుంచి.. పోలింగ్ పూర్తయ్యే వరకు నియోజకవర్గ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఫలితం వెల్లడైయ్యే రోజు నవంబర్ 14న ఉదయం 6 గంటల నుంచి.. నవంబర్ 15న ఉదయం 6 గంటల వరకూ 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. నవంబర్ 9 సాయంత్రం 6 గంటల నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని వైన్స్, బార్లు, మద్యం షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్‌లు (స్టార్ హోటళ్లలోని బార్‌లు, రిజిస్టర్డ్ క్లబ్‌లతో సహా) మూతపడనున్నాయి. ఈ ఆంక్షలు నవంబర్ 12 వరకు కొనసాగనున్నాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు కాబట్టి.. ఆ రోజు కూడా మద్యం విక్రయాలపై నిషేధం ఉంటుంది.
