తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే 2 దఫాలుగా పాదయాత్ర చేపట్టిన బండి సంజయ్ ఇటీవల యాదాద్రి నుంచి మూడో దశ పాదయాత్రను ప్రారంభించారు. అయితే.. నేడు వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని మూడో దశ పాదయాత్ర ముగించనున్నారు. అయితే.. మూడో దశ ప్రజసంగ్రామయాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అంధకారంలో ఉందన్నారు.
బండి సంజయ్ పాదయాత్ర సక్సెస్ అయ్యిందని, కేసీఆర్ పాలన, అవినీతిని అంతమొందించాలన్నారు. కేసీఆర్ ని ప్రజలు ఇంటిదగ్గర కూర్చోబెడతారని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణలో నయా నిజాం వచ్చారంటూ నడ్డా ఎద్దేవా చేశారు. తెలంగాణలో వెలుగులు నింపడానికే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని ఆయన అన్నారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ బాటలోనే కేసీఆర్ నడుస్తున్నారని నడ్డా విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ విమోచన దినం జరుపుతామని ఆయన అన్నారు.