Site icon NTV Telugu

Daughter of Putin Mentor: రష్యాను వీడిన పుతిన్‌ గురువు కుమార్తె.. ఎందుకంటే?

Daughter Of Putin Mentor

Daughter Of Putin Mentor

Daughter of Putin Mentor: ఉక్రెయిన్‌పై భీకర యుద్ధం చేస్తోన్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కొన్ని నెలలుగా యుద్ధం చేస్తోన్న రష్యా తమ దేశంలో నిర్బంధ సైనిక సమీకరణ అమలు చేస్తోంది. బలవంతంగా సైన్యంలో చేర్చుకుని యుద్ధానికి పంపిస్తోంది. ఈ నేపథ్యంలో చాలామంది పౌరులు దేశాన్ని వీడుతున్నారు. పుతిన్‌ లక్ష్యంగా చేసుకుంటారనే భయంతో చాలా మంది క్రెమ్లిన్‌ వ్యతిరేక నిరసనకారులు దేశం విడిచి వెళ్లారు. ఇదిలా ఉంటే.. వ్లాదిమిర్‌ పుతిన్‌ రాజకీయ గురువైన అనటోలి సొబ్‌చాక్‌ కుమార్తె, ప్రముఖ జర్నలిస్ట్ అయిన సెనియా సొబ్‌చాక్‌(40) రష్యాను వీడారు. ఓ కేసుకు సంబంధించి ఆమె సహోద్యోగిని నిర్బంధించిన పోలీసులు సెనియా సొబ్‌చాక్‌ ఇంట్లోనూ సోదాలు నిర్వహించగా.. ఈ తరుణంలో ఆమె రష్యాను వీడి లిథువేనియాకు వెళ్లిపోయారు.

Tamilnadu: తమిళనాడులో సంచలనం.. క్షుద్ర పూజల కోసం బాలిక తలను తీసుకెళ్లిన మాంత్రికుడు

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సెనియా.. ఈ యుద్ధం విషయంలో పుతిన్‌ను పలుమార్లు బహిరంగంగానే ప్రశ్నించారు. 2012 ఎన్నికలకు ముందు క్రెమ్లిన్‌ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న సెనియా.. 2018 అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌పై పోటీ చేసి 2 శాతం ఓట్లు సాధించారు. ఆ తర్వాత విపక్ష నేతలతో పుతిన్‌ నిర్వహించిన సమావేశంలో కూడా పాల్గొన్నారు. సెనియా పనిచేస్తోన్న మీడియా సంస్థ డైరెక్టర్‌ను పోలీసులు ఓ కేసులో ఇటీవల నిర్బంధించారు. అనంతరం సెనియా నివాసంపైనా పోలీసులు సోదాలు నిర్వహించారు. దర్యాప్తులో భాగంగా ఆమెను అరెస్టు చేసేందుకు వారెంట్‌ కూడా పోలీసులు వద్ద ఉన్నట్లు రష్యా మీడియా ఏజెన్సీ వెల్లడించింది. దీంతో ఆమె అరెస్ట్ ఖాయమన్న వార్తలు వచ్చాయి. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించిన సెనియా తమ మీడియా సంస్థపై కక్షతోనే దాడులు చేస్తున్నారని ఆరోపించారు. తాజాగా, రష్యాను వీడి లిథువేనియాకు వెళ్లిపోయారు.

Exit mobile version