NTV Telugu Site icon

Israel-Iran War: ఇజ్రాయెల్‌కు రక్షకుడిగా మారిన ముస్లిం దేశం.. మండిపడుతున్న ప్రజలు

Jordon

Jordon

Israel-Iran War: మంగళవారం అర్థరాత్రి ఇరాన్‌ ఇజ్రాయెల్‌పై వందలాది క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ సైనిక స్థావరాలు, మొసాద్ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులను ప్రయోగించారు. చాలా క్షిపణులను కూల్చివేయడంలో ఇజ్రాయెల్ వైమానిక రక్షణ విజయం సాధించింది. ఇందులో జోర్డాన్‌తో పాటు అమెరికా నుంచి ఇజ్రాయెల్ సాయం పొందినట్లు తెలిసింది. ఇజ్రాయెల్‌పై ప్రయోగించిన 180 క్షిపణుల్లో డజనుకు పైగా క్షిపణులను జోర్డాన్‌ అడ్డగించినట్లు సమాచారు. అనేక క్షిపణులు, డ్రోన్‌లను అడ్డగించినట్లు జోర్డాన్ అధికారులు చెప్పారు. అయితే, ఇరాన్ క్షిపణిని ఆపడం ద్వారా ఇజ్రాయెల్‌కు సహాయం చేసినందుకు ముస్లిం మెజారిటీ దేశం జోర్డాన్ ప్రభుత్వం, సైన్యం ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నాయి.

ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ క్షిపణులను తమ బలగాలు కూల్చివేసినట్లు జోర్డాన్ ప్రభుత్వం ధృవీకరించిందని మిడిల్ ఈస్ట్ ఐ నివేదించింది. మంగళవారం చివరలో ఒక ప్రకటనలో, జోర్డాన్ యొక్క డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ దాని వైమానిక రక్షణ క్షిపణులను, డ్రోన్‌లను ఇజ్రాయెల్ వైపుకు వెళ్లకుండా అడ్డగించిందని తెలిపింది. ఈ ప్రకటన రాగానే ప్రభుత్వంపైనా, సైన్యంపైనా విమర్శలు మొదలయ్యాయి. తమ గగనతలంలోకి ప్రవేశించిన అనేక క్షిపణులు, డ్రోన్‌లకు దేశ వైమానిక దళం, వైమానిక రక్షణ వ్యవస్థలు ప్రతిస్పందించాయని జోర్డాన్ అధికారులు చెప్పారు. జోర్డాన్ రాజధాని అమ్మాన్ శివార్లలోని రోడ్డుపై ఇరాన్ క్షిపణి పడిపోవడాన్ని స్థానిక మీడియా కూడా చూపించింది. ఇది ఆత్మరక్షణకు, దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశమని జోర్డాన్ అధికారులు చెబుతున్నారు.

Read Also: Hassan Nasrallah: మరణించిన ఐదు రోజుల్లోనే.. 100 మందికి పైగా ‘నస్రల్లా’లు జన్మించారు!

జోర్డాన్ ప్రభుత్వ ప్రతినిధి, మంత్రి మొహమ్మద్ అల్-మొమానీ మాట్లాడుతూ.. జోర్డాన్ ఏ పక్షం తరఫున వివాదంలో పాల్గొనదని, అయితే జోర్డానియన్లను రక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాలస్తీనా శరణార్థులు అత్యధికంగా ఉన్న దేశమైన జోర్దాన్ ప్రజలు తమ ప్రభుత్వ వైఖరిని ఇష్టపడలేదు. జోర్డాన్‌లోని చాలా మంది ప్రజలు ఇజ్రాయెల్‌కు సహాయం చేయడం ద్వారా తమ దేశం తప్పు వైపున ఉందని నమ్ముతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గాజాలో దాడుల కారణంగా ఇజ్రాయెల్‌పై జోర్డాన్ ప్రజలలో ఆగ్రహం ఉంది. అటువంటి పరిస్థితిలో, జోర్డాన్ ప్రభుత్వం చర్య ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించింది.ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడిని నిలిపివేయడం పట్ల ప్రజలు సంతోషంగా లేరని డెమోక్రటిక్ యూనిటీ పార్టీ సభ్యుడు, మూవ్‌మెంట్ టు రెసిస్ట్ నార్మలైజేషన్ సమన్వయకర్త మహ్మద్ అల్అబ్సీ అన్నారు. ఇరాన్ క్షిపణులను కూల్చివేయడం పాలస్తీనా, లెబనాన్‌లలో ప్రతిఘటనకు మద్దతు ఇవ్వాలనే ప్రజాదరణ పొందిన సెంటిమెంట్‌కు విరుద్ధంగా నడుస్తోంది.