కల్తీ మద్యం కేసులో తన ప్రమేయం లేదని విజయవాడ కననదుర్గమ్మ గుడిలో మాజీ మంత్రి జోగి రమేశ్ ప్రమాణం చేశారు. ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వచ్చిన ఆయన.. కననదుర్గమ్మ అమ్మవారి ఎదుట సత్యప్రమాణం చేశారు. ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ వద్ద చేతిలో దివ్వెను వెలిగించుకున్న జోగి రమేశ్.. కల్తీ మద్యం కేసులో తనకే సంబంధం లేదన్నారు. మద్యం కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, తన మనసు బాధ కలిగించారన్నారు. ‘జోగి రమేష్ అనే నేను.. తప్పు చేయలేదు, తప్పు చెయ్యను’ అని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అమ్మ వారి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని జోగి రమేశ్ డిమాండ్ చేశారు.
‘కొండపై కనకదుర్గమ్మ, కొండ కృష్ణమ్మ సాక్షిగా చెప్తున్నా.. నిబద్ధతతో నిజాయితీతో నిండు మనస్సుతో చెప్తున్నా.. కల్తీ మద్యం పేరుతో నా హృదయం గాయపరిచారు, నా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. జోగి రమేష్ అనే నేను.. తప్పు చేయలేదు, తప్పు చెయ్యను. అమ్మవారి సాక్షిగా చెప్తున్నా.. నా వ్యక్తిత్వాన్ని కించపరిచిన వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకున్నా. ఏడు కొండలు సాక్షిగా, ఇంద్రకీలాద్రి సాక్షిగా ప్రమాణం చేసేందుకు రావాలని సీఎం కుటుంబ సభ్యులను అడిగాను. నేను తప్పు చేయలేదని నార్కో ఎనాలిసిస్, లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నా. నేను తప్పు చేయలేదు నిబద్ధతతో నిజాయితీతో చెప్తున్నా. ముఖ్యమంత్రికి, సీఎం తనయుడికి చెప్తున్నా. మీడియా సమక్షంలో కల్తీ మద్యం గురించి రాష్ట్ర ప్రజలకు నా నిజాయితి చూపించాను. ఎవరో తెలియని పాపాన్ని నాకు అంటిస్తున్నారు’ అని జోగి రమేశ్ మీడియాతో అన్నారు.
Also Read: Nara Lokesh: సీఎంకు ప్రధాని ఫోన్.. మంత్రి నారా లోకేష్‌కు కీలక బాధ్యతలు!
‘సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఇద్దరిని తిరుమల రావాలని 10 రోజులుగా అభ్యర్థించా. భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పాలని అడిగా స్పందించలేదు. ఎవడో ఇబ్రహీంపట్నంలో పుట్టిన వాడు చెప్పింది విని నన్ను దోషి అంటున్నారు. రిమాండ్ రిపోర్ట్లో నా పేరు లేదు, కోర్టులో నా పేరు చెప్పలేదు, దక్షిణాఫ్రికా నుంచి విడుదల చేసిన వీడియోలో నా పేరు లేదు. సిట్ అధికారులు వచ్చి నేను తప్పు చేశానని చెప్పి నిరూపిస్తే.. ఇక్కడే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతా. నన్ను రాజకీయంగా దెబ్బకొట్టు కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడవద్దు. మీకు బార్య, పిల్లలు ఉన్నారు.. ఈరోజుతో ఇదంతా ఆగిపోదు’ అని మాజీ మంత్రి జోగి రమేశ్ మండిపడ్డారు.
