మూడు జైళ్లలో తనను ఇబ్బంది పెట్టారని మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ చెప్పారు. దమ్ముంటే సీబీఐ ఎంక్వైరీ వేయాలని చెప్పానని, లై డిటెక్టర్ పరీక్షలు చేయమని చెప్పానని, తిరుమలలో ప్రమాణం చేస్తానని చెప్పాను అని తెలియారు. రాక్షసానందం పొందడానికే సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తనను అరెస్ట్ చేయించారన్నారు. 3 నెలల పాటు తనను జైల్లో పెట్టినంత మాత్రాన భయపడతానా? అని.. వైసీపీ కార్యకర్తలు భయపడతారనుకుంటే పొరపాటు అని జోగి రమేష్ చెప్పుకొచ్చారు. 85 రోజులకు పైగా విజయవాడ జైలులో ఉన్న జోగి సోదరులు ఈరోజు బెయిల్ పై రిలీజ్ అయ్యారు.
జైలు నుంచి విడుదల అయిన వైసీపీ నేత జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. ‘నన్ను అన్యాయంగా కేసుల్లో ఇరికించి అరెస్టు చేశారు. ఇష్టం వచ్చినట్లుగా జైళ్ల చుట్టూ తిప్పారు. సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించాను. అంతకముందు పది మీడియా సమావేశాల్లో సీబీఐ విచారణ వేయాలని చెప్పా. లేదా నార్కో ఎనాలసిస్, లై డిటెక్టర్ పరీక్షలకు సిద్దం అని చెప్పా. సీఎం చంద్రబాబు ఇంటికి అయినా వచ్చి చర్చిస్తా అని అడిగా. దుర్గమ్మ సాక్షిగా తప్పు చేయలేదని, చర్చకు రావాలని సవాల్ చేశా. అయినా కుట్రతో నన్ను అరెస్టు చేయించారు. చంద్రబాబు కూర్చో అంటే కూర్చుంటారు.. నిలుచో అంటే నిలుచుంటారు సిట్ అధికారులు. మీకు పిల్లలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. అన్యాయంగా కేసులు పెడితే పైన భగవంతుడు శిక్షిస్తాడని చెప్పా. అయినా రాక్షస ఆనందం కోసం అరెస్టు చేసి 83 రోజుల పాటు నన్ను, నా సోదరుడిని జైల్లో పెట్టారు’ అని జోగి రమేష్ అన్నారు.
Also Read: KTR-Phone Tapping Case: విచారణలో నేను తప్ప ఏ రావు లేడు.. వేధింపులు తప్ప ఏమీ లేదు!
‘మూడు నెలలు నన్ను జైల్లో ఉంచినందుకు మీ రాక్షస ఆనందం తీరిందా? అని అడుగుతున్నా. కేసులు పెడితే వైసీపీ నాయకులు భయపడతారని అనుకుంటున్నారా?. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఫేక్ సీఎం.. అన్నీ డ్రామాలు. మా లీడర్ వైఎస్ జగన్ సారథ్యంలో ముందుకు వెళతాం. చంద్రబాబు, నా లోకేష్‌లకు భయపడే వ్యక్తులం కాదు. రేపు అమ్మవారి గుడికి వెళుతున్నా. తప్పు చేయలేదని ప్రమాణం చేస్తాం, మంత్రి లోకేష్‌కు దమ్ముంటే వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ చేస్తున్నా’ అని వైసీపీ నేత జోగి రమేష్ ఛాలెంజ్ విసిరారు. మైలవరం ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌లో జోగి రమేష్ సోదరులకు ఘన స్వాగతం పలికారు అభిమానులు. బాణా సంచాలు కాల్చి మైలవరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఇంటికి చేరుకున్న జోగి రమేష్‌కు కుటుంబ సభ్యులు హారతితో స్వాగతం పలికారు. ఆయన సతీమణి శంకుతల ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
