Site icon NTV Telugu

Jemimah Rodrigues: అంతా దేవుడే చూసుకున్నాడు.. కన్నీటి పర్యంతమైన జెమీమా!

Jemimah Rodrigues

Jemimah Rodrigues

2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో తాను ఏడవని రోజు లేదని, మానసికంగా సరిగ్గా లేనని స్టార్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్‌ తెలిపింది. సెమీస్‌లో జట్టు కోసం నిలబడాలనుకున్నానని, మిగిలినదంతా ఆ దేవుడే చూసుకున్నాడని పేర్కొంది. ఆస్ట్రేలియాపై గెలవడం పట్ల సంతోషాన్ని ఆపుకోలేకపోయానని, అందుకే మైదానంలోనే కన్నీళ్లు వచ్చాయని చెప్పింది. టీమిండియా గెలవడం పట్ల తాను ఒక్కదాన్నే క్రెడిట్‌ను తీసుకోవాలనుకోవడం లేదని, మ్యాచ్‌ను తాను ఒక్కదాన్నే గెలిపించలేదని జెమీమా చెప్పుకొచ్చింది. సెమీస్‌లో ఆసీస్ నిర్ధేశించిన 339 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 9 బంతులుండగానే ఛేదించింది. జెమీమా అజేయసెంచరీ (127: 134 బంతుల్లో 14 ఫోర్లు)తో మ్యాచ్‌ను గెలిచింది.

మ్యాచ్ అనంతరం జెమీమా రోడ్రిగ్స్‌ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘ముందుగా దేవుడికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే నేను ఒంటరిగా ఈ ఇన్నింగ్స్ ఆడలేదు. ఈరోజు నన్ను ఆ జీసస్ ముందుకు నడిపించాడు. అమ్మ, నాన్న, కోచ్, ఆత్మీయులు.. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. గత నాలుగు నెలలు కష్టంగా గడిచాయి. ఇప్పుడు అంతా ఒక కలలా అనిపిస్తుంది. ఇంకా ముగియలేదు. ఫైనల్ మ్యాచ్ ఉంది. అందులో గెలిస్తేనే పరిపూర్ణం అవుతుంది. నేను 3వ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తానని ముందుగా తెలియదు. స్నానం చేస్తున్నప్పుడు కూడా ఐదవ స్థానంలో ఆడతానని అనుకున్నా. కేవలం ఐదు నిమిషాల ముందే చెప్పారు. వెంటనే సిద్దమయ్యా. నా కోసం పెద్ద ఇన్నింగ్స్‌ ఆడాలనుకోలేదు. ఈ మ్యాచ్‌లో గెలిపించి టీమిండియాను ఫైనల్‌కు తీసుకెళ్లాలనుకున్నా. ఈ రోజు సెంచరీ, హాఫ్ సెంచరీ గురించి ఆలోచించలేదు. జట్టును గెలిపించడం గురించే నా ఆలోచనలు తిరిగాయి’ అని జెమీమా తెలిపింది.

Also Read: India Women’s Team: చరిత్ర సృష్టించిన భారత మహిళా జట్టు.. పురుషుల వల్ల కూడా కాలేదు!

‘ఈరోజు నాకు అవకాశాలు (లైఫ్స్) వచ్చాయని తెలుసు. ఇదంతా ఆ దేవుడి దయ. సరైన ఉద్దేశ్యంతో పని చేస్తే.. దేవుడు ఆశీర్వదిస్తాడు. గత ప్రపంచకప్ నుండి నన్ను తొలగించారు. ఈ సంవత్సరం జట్టులోకి వచ్చాను. కొన్ని విషయాలు మన పరిధిలో ఉండవు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకున్నా. ఈ పర్యటనలో నేను ప్రతిరోజూ ఏడ్చాను. మానసికంగా బాగా లేను, చాలా ఆందోళనగా ఉన్నా. ఈ టోర్నీ నాకు ఓ సవాలు. నేను చేయాల్సిందల్లా చేశాను. మిగతాది ఆ దేవుడు చూసుకున్నాడు. మాచుపై దృష్టి కేంద్రీకరించడానికి నాతోనే నేను మాట్లాడుకుంటూనే ఉంటా. నేను చాలా అలసిపోయాను. అయినా ఈరోజు జట్టు కోసం నిలబడాలనుకున్నాను. బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు తీవ్ర ఒత్తిడి ఉన్నా.. ప్రశాంతంగా అధిగమించేందుకు ప్రయత్నించా. భారత్ గెలవడంతో సంతోషాన్ని ఆపుకోలేకపోయాను. మైదనంలో నా సహచరులు ప్రోత్సహించారు. అభిమానుల ప్రోత్సాహం ఉత్సాహపరిచింది’ అని జెమీమా రోడ్రిగ్స్‌ పేర్కొంది.

Exit mobile version