NTV Telugu Site icon

JEE Mains 2024 Results: జేఈఈ మెయిన్‌ 2024 ఫలితాలు.. 10 మంది తెలుగు విద్యార్థులకు 100 శాతం స్కోరు!

Jee Main 2024 Result

Jee Main 2024 Result

23 students scored 100 NTA score in session 1: దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లోని ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్‌ 2024 సెషన్‌-1 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మంగళవారం విడుదల చేసింది. పేపర్‌ -1 (బీఈ/బీటెక్‌) ఫలితాల్లో దేశవ్యాప్తంగా 23 మంది విద్యార్థులు 100 శాతం స్కోరు సాధించారు. ఈ 23 మందిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 10 విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ నుంచి ఏడుగురు, ఏపీ నుంచి ముగ్గురు విద్యార్థులు 100 శాతం స్కోరు సాధించారు.

తెలంగాణకు చెందిన పబ్బ రోహన్‌ సాయి, ముతవరపు అనూప్‌, రిషి శేఖర్‌ శుక్లా, హుందేకర్‌ విదిత్‌, మదినేని వెంకట సాయి తేజ, తవ్వ దినేశ్‌ రెడ్డి, కల్లూరి శ్రియాషస్‌ మోహన్‌లు జేఈఈ మెయిన్‌ పేపర్‌ -1లో 100 శాతం స్కోరు సాధించగా.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన షేక్‌ సూరజ్‌, తోట సాయి కార్తిక్‌, అన్నారెడ్డి తనీశ్‌ రెడ్డిలు 100 శాతం స్కోరు సాధించారు. రాజస్థాన్‌, మహారాష్ట్రల నుంచి ముగ్గురు.. హర్యానా, ఢిల్లీ నుంచి ఇద్దరు.. గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడు నుంచి ఒక్కొక్కరు చొప్పున 100 శాతం స్కోరు సాధించారు.

Also Read: Dattajirao Gaekwad Dead: భారత క్రికెట్‌లో విషాదం.. మాజీ కెప్టెన్‌ కన్నుమూత!

2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జేఈఈ మెయిన్‌ తొలి విడత పేపర్‌-1 పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 11,70,036 మంది విద్యార్థులు హాజరయ్యారు. సెషన్‌ 2 పరీక్ష ఏప్రిల్‌ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ ఇప్పటికే ప్రకటించింది. సెషన్‌ 1 రాసిన విద్యార్థులు సెషన్‌ 2కు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పుడు రెండింటిలో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.