నేటి పోటీ ప్రపంచంలో పిల్లల భుజాలపై ర్యాంకులు, మార్కుల బరువును మోపుతున్న తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించేలా.. ప్రతి ఇంటి కథను కళ్లకు కట్టినట్లు చూపించేందుకు సిద్ధమైన చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్’. బాలల దినోత్సవం కానుకగా రేపు (నవంబర్ 14) థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు.. విడుదల వేళ అగ్ర నిర్మాత దిల్ రాజు రూపంలో మరో పెద్ద బూస్ట్ లభించింది. ఆయన చేతుల మీదుగా విడుదలైన ‘నా కనుపాపే’ అనే ఎమోషనల్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో కంటతడి పెట్టిస్తూ వైరల్ అవుతోంది.
కమర్షియల్ హంగుల కంటే కథలో ఉండే బలమైన భావోద్వేగాలకు విలువనిచ్చే అగ్ర నిర్మాత దిల్ రాజు, ఈ పాటను లాంచ్ చేసి చిత్రబృందానికి తన పూర్తి మద్దతు తెలిపారు. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండాల్సిన అసలైన ప్రేమ, అనుబంధాన్ని ఈ పాటలో ఎంతో ఆర్ద్రతతో ఆవిష్కరించారు. ప్రవీణ్ బొలిశెట్టి అందించిన అద్భుతమైన బాణీకి తోడు, ఆయన రాసిన హృదయాన్ని హత్తుకునే సాహిత్యం నేటి తరం పేరెంట్స్‌ను ఆలోచింపజేసేలా ఉంది. దీనికి మోహిత్ కులకర్ణి సంగీతం, సింగర్ చిన్మయి శ్రీపాద తన మధురమైన గాత్రంతో ప్రాణం పోశారు. నమో జయం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మించిన ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన దర్శకత్వం వహించారు. కేవలం ర్యాంకుల వేటలో పడి పిల్లల బాల్యాన్ని, వారి ఆలోచనలను చిదిమేయకుండా.. వారి మనసులను అర్థం చేసుకోవాలనే ఒక గొప్ప సామాజిక సందేశాన్ని ఇందులో చర్చించారు. అందుకే ఈ సినిమాను పిల్లలతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా తప్పకుండా చూడాలని చిత్రయూనిట్ కోరుతోంది.

