NTV Telugu Site icon

BCCI-India Coach: ఆస్ట్రేలియా మాజీలకు కౌంటర్.. టీమిండియా కొత్త కోచ్‌పై జై షా హింట్!

Jay Shah

Jay Shah

BCCI secretary Jay Shah Slams Ricky Ponting and Justin Langer: టీమిండియా హెడ్ కోచ్‌ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం జూన్ చివరితో ముగియనుంది. టీ20 ప్రపంచకప్‌ 2024 అనంతరం కొత్త కోచ్‌ బాధ్యతలు చేపడతాడు. అయితే బీసీసీఐ ఆఫర్ ఇస్తున్నా కోచ్ పదవిని చేపట్టడానికి విదేశీ మాజీ క్రికెటర్లు ఆసక్తి చూపించట్లేదని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కోచ్‌గా బాధ్యతలు అందుకున్న తర్వాత కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపలేమని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. భారత కోచ్‌గా తీవ్ర స్థాయిలో ఒత్తిడి, రాజకీయాలను ఎదుర్కోవాల్సి వస్తుందని జస్టిన్‌ లాంగర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీలకు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా కౌంటర్ ఇచ్చారు.

టీమిండియా హెడ్ కోచ్‌ పదవి కోసం బీసీసీఐ ఎవరినీ సంప్రదించలేదని జై షా స్పష్టం చేశారు. ‘నేను కానీ, బీసీసీఐ ఆఫీస్‌ బేరర్లు ఎవరూ కానీ ఏ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ను సంప్రదించలేదు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. హెడ్ కోచ్‌గా సరైన వ్యక్తినే ఎంపిక చేస్తాం. అదంతా ఓ ప్రణాళిక ప్రకారంగా జరుగుతుంది. భారత క్రికెట్‌ స్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న వారి కోసం చూస్తున్నాం. అద్భుత నైపుణ్యంతో జట్టును ఉన్నత శిఖరాలకు చేర్చే వారినే ఎంపిక చేస్తాం. దేశవాళీ క్రికెట్‌ గురించి పూర్తిగా తెలిసిన వారిని తీసుకొనేందుకు మొగ్గు చూపిస్తాం’ అని జై షా స్పష్టం చేశారు.

Also Read: Anasuya Bharadwaj: పొట్టి డ్రెస్‌లో అనసూయ జలకాలాట.. పిక్స్ చూస్తే ‘ఆహా’ అనాల్సిందే!

టీమిండియా హెడ్ కోచ్‌ పదవి కోసం మే 27 దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు. ఇప్పటి వరకు ఎవరు అప్లై చేశారనేది ఇంకా తెలియరాలేదు. చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ వైపే బీసీసీఐ ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఏడాదిలో పది నెలల పాటు భారత జట్టుతో ఉండటమే అతడికి ఇబ్బందిగా ఉందని సమాచారం. ఈ విషయంలో ఫ్లెమింగ్‌ను ఒప్పించే బాధ్యతను ఎంఎస్ ధోనీపై బీసీసీఐ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పేరు కూడా రేసులో ఉందట. తాను దరఖాస్తు చేయడం లేదని రికీ పాంటింగ్‌ ఇప్పటికే వెల్లడించాడు. జస్టిన్‌ లాంగర్ ఈ భారాన్ని మోయలేనని చేతులెత్తేశాడు. జై షా వ్యాఖ్యలను బట్టి భారత నుంచే కోచ్ ఉంటాడని స్పష్టమవుతోంది.

 

Show comments