Jay Shah Says Rohit Sharma Lead India in ICC Champions Trophy 2025: టీమిండియా కెప్టెన్సీపై బీసీసీఐ కార్యదర్శి జై షా క్లారిటీ ఇచ్చారు. టీ20 ప్రపంచకప్ 2024ను అందించిన రోహిత్ శర్మ నాయకత్వంలోనే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తలపడనుందని స్పష్టం చేశారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్‌కు భారత్ చేరితే.. రోహితే సారథ్యం వహిస్తాడని తెలిపారు. హిట్‌మ్యాన్ సారథ్యంలో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్ గెలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
11 ఏళ్ల తర్వాత భారత్‌కు రోహిత్ శర్మ ఐసీసీ ట్రోఫీని అందించిన విషయం తెలిసిందే. కప్ అందించిన హిట్‌మ్యాన్.. అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. రోహిత్ సహా విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా కూడా టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు. ఇక ఈ ముగ్గురు టెస్టులు, వన్డేలపై దృష్టి పెట్టనున్నారు. డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచే బాధ్యతను ఇప్పటికే రోహిత్, విరాట్‌కు మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ అప్పగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జై షా కూడా రోహిత్ సారథ్యంలోని భారత జట్టు ఈ రెండు ట్రోఫీలు గెలుస్తుందన్నారు.
Also Read: Gym Viral Video: శారీలో సూపర్‌గా వర్కౌట్స్.. యువతి కన్ను గీటుకు పడిపోవాల్సిందే!
వచ్చే ఏడాది జూన్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ అగ్రస్థానంలోఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ఫైనల్ ఆడుతాయి. భారత్ ఇప్పటికే రెండుసార్లు ఫైనల్‌కు చేరినా.. విజేతగా నిలవని విషయం తెలిసిందే. ఇక ఎనిమిది దేశాలు పాల్గొనే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనుంది. ఈ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పటికే డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను ఐసీసీకి పీసీబీ పంపింది. డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం.. మార్చి 1న లాహోర్ వేదికగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఉంది.