NTV Telugu Site icon

Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ నుంచి జస్ప్రీత్ బుమ్రా ఔట్‌!

Jasprit Bumrah

Jasprit Bumrah

అందరూ ఊహించిందే జరిగింది. ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా ఆడడం లేదు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2025 చివరలో గాయపడ్డ బుమ్రా.. ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో ఛాంపియన్స్‌ ట్రోఫీకి దూరమయ్యాడు. వెన్ను గాయం వల్ల బుమ్రా ఛాంపియన్స్‌ ట్రోఫీకి దూరమయ్యాడని బీసీసీఐ మంగళవారం రాత్రి ఎక్స్‌లో తెలిపింది. అతడి స్థానంలో యువ పేసర్‌ హర్షిత్‌ రాణాను జట్టులోకి తీసుకున్నట్లు పేర్కొంది.

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 కోసం జనవరిలో ప్రకటించిన జట్టులో జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ సెలెక్టర్లు చోటు కల్పించారు. అప్పటికి బుమ్రా ఫిట్‌గా లేడు. జనవరి మొదటి వారంలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టు సందర్భంగా గాయపడ్డ బుమ్రా స్వదేశానికి వచ్చాక కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాడు. అనంతరం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో చేరి.. అక్కడి వైద్య బృందం పర్యవేక్షణలో గాయం నుంచి కోలుకునే ప్రక్రియ మొదలుపెట్టాడు. అయిదుగురితో కూడిన ప్రత్యేక బృందం ఎంత ప్రయత్నం చేసినా.. బుమ్రా ఫిట్‌నెస్‌ సాధించలేకపోయాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 జట్టులో మార్పులు చేయడానికి మంగళవారం తుది గడువు కాగా.. ఎన్‌సీఏ వైద్య బృందం బుమ్రా ఫిట్‌నెస్‌పై బీసీసీఐకి తుది నివేదిక సమర్పించింది.

జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి దాదాపు కోలుకున్నట్లే అని ఎన్‌సీఏ వైద్య బృందం పేర్కొంది. అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా బౌలింగ్‌ చేయగలడని హామీ మాత్రం ఇవ్వలేదట. ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడించడంపై బీసీసీఐ సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవాలని ఎన్‌సీఏ వైద్య బృందం చెప్పిందట. బుమ్రాను ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడిస్తే.. గాయం తిరగబెట్టొచ్చని, ఎక్కువ కాలం మైదానానికి దూరమవుతాడని భావించిన బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుందట. ఛాంపియన్స్‌ ట్రోఫీలో బుమ్రా లేకపోవడం భారత జట్టుకు కచ్చితంగా లోటే అనే చెప్పాలి. వెన్ను గాయం కారణంగానే గతంలో ఏడాదికి పైగా బుమ్రా మైదానానికి దూరమమైన విషయం తెలిసిందే.