NTV Telugu Site icon

Jasprit Bumrah: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. జస్ప్రీత్ బుమ్రా దూరం!

Jasprit Bumrah

Jasprit Bumrah

లీడ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ అనూహ్యంగా ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. పేలవ బౌలింగ్ కారణంగా ఇంగ్లండ్‌ భారీ లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించింది. జూలై 2న బర్మింగ్‌హామ్‌లో ఆరంభం అయ్యే రెండో టెస్టులో కఠిన సవాలును టీమిండియా ఎదుర్కోబోతోంది. రెండో టెస్టులో గెలవడం గిల్ సేనకు ఎంతో కీలకం. ఈ కీలక టెస్టుకు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడని తెలుస్తోంది.

కొన్నేళ్లుగా జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్‌ సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిపై ఎక్కువ భారం పడకుండా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడించాలని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగే రెండో టెస్టులో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. బుమ్రా స్థానంలో పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ ఆడే అవకాశాలు ఉన్నాయి. అర్ష్‌దీప్‌ ఇంకా టెస్టు అరంగేట్రం చేయని విషయం తెలిసిందే. అర్ష్‌దీప్‌కు టీ20ల్లో మంచి రికార్డు ఉంది.

లీడ్స్‌లో జరిగిన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు తీశాడు. ఇతర బౌలర్ల నుంచి సహకారం లేకపోవడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ వికెట్లు తీయలేకపోయారు. ప్రసిద్ధ్ తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో మూడు (3/128), రెండవ ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లలో రెండు ( 2/92) వికెట్స్ తీశాడు. మహమ్మద్ సిరాజ్ మొదటి ఇన్నింగ్స్‌లో 27 ఓవర్లలో రెండు (2/122), రెండవ ఇన్నింగ్స్‌లో 14 ఓవర్లలో (0/51) ఒక్క వికెట్ తీయలేదు. తొలి టెస్టులో బుమ్రా 43.4 ఓవర్లలో 3.20 ఎకానమీతో (5/140) ఐదు వికెట్స్ పడగొట్టగా.. శార్దూల్, సిరాజ్, ప్రసిద్ధ్ కలిసి 92 ఓవర్లలో (9/482) 9 వికెట్స్ మాత్రమే తీశారు. రెండో టెస్టుకు బుమ్రా దూరమైతే టీమిండియాకు పెద్ద దెబ్బె అనే చెప్పాలి.