NTV Telugu Site icon

Jasprit Bumrah Record: చరిత్ర సృష్టించిన బుమ్రా.. తొలి బౌలర్‌గా అరుదైన రికార్డు!

Jasprit Bumrah

Jasprit Bumrah

భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అత్యధిక రేటింగ్ పాయింట్లను సాధించిన టీమిండియా బౌలర్‌గా నిలిచాడు. బుమ్రా ఖాతాలో ప్రస్తుతం 907 రేటింగ్ పాయింట్స్‌ ఉన్నాయి. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో సంచలన ప్రదర్శనకు గాను ఈ రికార్డు బుమ్రా ఖాతాలో చేరింది. ఈ ట్రోఫీలో ఇప్పటివరకు 4 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 30 వికెట్స్ పడగొట్టాడు. తాజా ఐసీసీ టెస్ట్ ర్యాకింగ్స్‌లో బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డ్‌ను జస్ప్రీత్ బుమ్రా అధిగమించాడు. 2016లో యాష్ అత్యధికంగా 904 రేటింగ్ పాయింట్స్ సాధించాడు. తాజాగా బుమ్రా 907 రేటింగ్ పాయింట్స్‌తో అశ్విన్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అత్యధిక రేటింగ్ పాయింట్ల జాబితాలో ఒక శతాబ్దం క్రితం ఆడిన ఇంగ్లండ్ సీమర్లు సిడ్నీ బర్న్స్ (932), జార్జ్ లోమాన్ (931) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ (922), శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (920) మూడు, నాల్గవ స్థానాల్లో ఉన్నారు.

టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన రెండో భారత పేసర్‌గా కూడా జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ 1983లో 50 టెస్ట్ మ్యాచ్‌లలో ఈ రికార్డును సాధించగా.. బుమ్రా 44వ టెస్ట్‌లో ఈ మైలురాయిని అందుకున్నాడు. రవీంద్ర జడేజాతో కలిసి 200 టెస్టు వికెట్లు తీసిన రెండో భారత ఆటగాడిగా బుమ్రా నిలిచాడు. ఈ జాబితాలో ఆర్ అశ్విన్ అగ్రస్థానంలో ఉన్నాడు. 37 టెస్టుల్లోనే యాష్ 200వ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

Show comments