జపాన్ ప్రధాని సనే తకైచి భారత్ పర్యటనకు వస్తున్నారు. జూలై 1-3 తేదీల్లో భారతదేశంలో తొలి పర్యటనకు రానున్నారు. అయితే ముందుగా నిర్ణయించిన అస్సాం పర్యటనను రద్దు చేసినట్లు తెలుస్తోంది. తొలుత భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సును గౌహతిలో నిర్వహించే అవకాశాన్ని పరిశీలించినప్పటికీ.. షెడ్యూల్ సమస్యలు, లాజిస్టిక్ ఇబ్బందుల కారణంగా చివరకు ఢిల్లీనే వేదికగా నిర్ణయించారు.
సమాచారం ప్రకారం.. జపాన్ ప్రధాని సనే తకైచి పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. జపాన్ ప్రధాని వెంట పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులతో కూడిన భారీ ప్రతినిధి బృందం కూడా రానుంది. ఇదిలా ఉంటే జపాన్ పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో తకైచి షెడ్యూల్ కూడా చాలా పరిమితంగా ఉందని వర్గాలు తెలిపాయి.
ఇటీవల అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ జపాన్ ప్రధాని.. అస్సాం రాష్ట్రాన్ని సందర్శించే అవకాశంపై సంకేతాలు ఇచ్చారు. జపాన్ మీడియా సంస్థలు కూడా ఈ పర్యటనపై కథనాలు ప్రచురించాయి. అయితే తాజా పరిణామాలతో ఆ పర్యటన జరగడం లేదని స్పష్టమైంది. భారత్ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి జపాన్ గత కొన్ని సంవత్సరాలుగా భారీ స్థాయిలో సహకారం అందిస్తోంది. విదేశీ అభివృద్ధి సహాయ (ODA) కార్యక్రమాల కింద దాదాపు రూ.22 వేల కోట్లకు పైగా నిధులు అందించింది. ముఖ్యంగా రహదారి అనుసంధానం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించింది. అస్సాంలో ఆరోగ్య వ్యవస్థ బలోపేతానికి సుమారు రూ.3,800 కోట్ల ప్రాజెక్టు, గౌహతి నీటి సరఫరా పథకం, ఈశాన్య ప్రాంతంలో వెదురు పరిశ్రమ అభివృద్ధి, పలు రాష్ట్రాల్లో వంతెనల నిర్మాణం వంటి అనేక ప్రాజెక్టులకు జపాన్ మద్దతు అందిస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు భారత్ విశ్వసించే ప్రధాన దేశాల్లో జపాన్ ఒకటిగా నిలిచింది.
గత ఏడాది టోక్యోలో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా భారత్-జపాన్ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి. జపాన్ తన పెట్టుబడులను 34 బిలియన్ డాలర్ల నుంచి 68 బిలియన్ డాలర్లకు పెంచేందుకు అంగీకరించింది. అలాగే భద్రతా సహకారంపై ఉమ్మడి ప్రకటన విడుదల చేసిన రెండు దేశాలు.. రక్షణ సాంకేతికత సహ ఉత్పత్తి, సంయుక్త సైనిక విన్యాసాలు, నూతన సాంకేతిక రంగాల్లో సహకారం పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయి.
సనే తకైచి పర్యటన ఆసియా భౌగోళిక రాజకీయాల్లో కీలక సమయంలో జరుగుతోంది. ఇటీవల జపాన్-చైనా సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. తైవాన్ అంశంపై చైనా చర్యలకు జపాన్ గట్టిగా స్పందించే అవకాశం ఉందని తకైచి గతంలో వ్యాఖ్యానించారు. మరోవైపు అమెరికా-చైనా సంబంధాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల బీజింగ్ పర్యటించారు. అలాగే అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గి శాంతి చర్చలు ప్రారంభమైన నేపథ్యంలో అంతర్జాతీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో జరిగే భారత్-జపాన్ శిఖరాగ్ర సమావేశం ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇండో-పసిఫిక్ ప్రాంత భద్రత, ఆర్థిక సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక నిర్ణయాలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

