NTV Telugu Site icon

Australian Open 2025: క్వార్టర్‌ఫైనల్‌కు సినర్‌.. ఎదురులేని స్వైటెక్‌!

Jannik Sinner

Jannik Sinner

టాప్‌ సీడ్, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ యానిక్‌ సినర్‌ (ఇటలీ) ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2025 క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. నాలుగో రౌండ్లో 6-3, 3-6, 6-2, 6-2తో 13వ సీడ్‌ రూన్‌ (డెన్మార్క్‌)పై గెలుపొందాడు. యువ ఆటగాళ్లు ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. మూడో సెట్లో ఓ ర్యాలీ 37 షాట్ల పాటు సాగిందంటే అర్ధం చేసుకోవచ్చు. వేడి, ఉక్కపోత పరిస్థితుల మధ్య గాయంతో ఇబ్బందిపడుతూనే సినర్‌ మ్యాచ్ నెగ్గాడు. ఇక క్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్‌ డిమినార్‌ (ఆస్ట్రేలియా)ను టైటిల్‌ ఫేవరెట్‌ సినర్‌ ఢీకొంటాడు. ఈరోజు జరిగే క్వార్టర్స్‌లో అల్కరాస్‌ను జకోవిచ్‌.. టామీ పాల్‌తో జ్వెరెవ్‌ తలపడతాడు.

మహిళల సింగిల్స్‌లో ఆరో సీడ్‌ రిబకినా (కజకిస్థాన్‌) ఓడిపోయింది. ప్రిక్వార్టర్స్‌లో 3-6, 6-1, 3-6తో మాడిసన్‌ కీస్‌ (అమెరికా) చేతిలో పరాజయం పాలైంది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2025లో స్వైటెక్‌ (పోలెండ్‌) దూసుకుపోతోంది. నాలుగో రౌండ్లో స్వైటెక్‌ 6-0, 6-1తో ఎవాలిస్‌ (జర్మనీ)ని చిత్తు చేసింది. ఎనిమిదో సీడ్‌ నవారో (అమెరికా), స్వితోలినా (ఉక్రెయిన్‌) క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. నవారో 6-4, 5-7, 7-5తో కసట్కినా (రష్యా)పై.. స్వితోలినా 6-4, 6-1తో కుద్రెమెతోవా (రష్యా)పై విజయం సాధించారు.