NTV Telugu Site icon

Janasena vs Volunteers: ఏపీలో ఓ రేంజ్‌లో వాలంటీర్‌ వార్.. ఇరకాటంలో టీడీపీ..?

Tdp

Tdp

Janasena vs Volunteers: వారాహి యాత్ర రెండో విడత ఆరంభం నుంచే.. వాలంటీర్లపై హాట్‌ కామెంట్స్‌తో ఏపీ రాజకీయాన్ని తనవైపునకు తిప్పుకోగలిగారు పవన్‌ కల్యాణ్‌.. దాని మీద చివరికి అధికార పార్టీనే రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సి వచ్చింది. అత్యంత సున్నితమైన అంశాన్ని టచ్ చేయడంతోపాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల డేటా చోరీ అవుతోందనే అంశాన్ని చర్చకు పెట్టే ప్రయత్నం చేశారాయన. ఈ క్రమంలో గత నాలుగైదు రోజుల నుంచి ఏపీలో వాలంటీర్ల వార్ నడుస్తూనే ఉంది. దీనిపై మొదటి రోజు ఏం చేయాలో.. ఎలా స్పందించాలో తేల్చుకోలేక మౌనాన్ని ఆశ్రయించిందట టీడీపీ. అయితే.. ఆ తర్వాత టీడీపీ నేతలు కానీ.. చంద్రబాబు కానీ నెమ్మదిగా పవన్ బాటే పట్టారు. హ్యూమన్ ట్రాఫికింగ్‌కు వాలంటీర్లే కారణమని నేరుగా పవన్ స్థాయిలో కామెంట్స్‌ చేయకున్నా.. దాదాపు అదే రేంజ్‌లో పార్టీ నుంచి రియాక్షన్‌ వస్తోంది. ప్రజల వ్యక్తిగత సమాచారంతో వాలంటీర్లకు ఏం అవసరమన్న యాంగిల్‌లో ప్రశ్నాస్త్రాలు సంధిస్తోంది తెలుగుదేశం.

అయితే… వాలంటీర్‌ వార్ లో టీడీపీ జోక్యం చేసుకోవాలా..? వద్దా అనే అంశంపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు తెలిసింది. ఈ ఎపిసోడ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న అభిప్రాయం కొందరు నేతల్లో ఉన్నట్టు తెలిసింది. వాలంటీర్ల వ్యవస్థను ప్రస్తుతమున్న పరిస్థితుల్లో టచ్ చేయకుండా ఉంటేనే బాగుంటుందని భావిస్తున్నారట సదరు నేతలు. వాలంటీర్లల్లో కూడా చాలా వరకు అసంతృప్తి ఉందని, అలాంటప్పుడు ఎన్నికల్లో వాళ్ల వల్ల కాస్తో కూస్తో లాభపడొచ్చుకదా అన్నది ఆ.. కొంతమంది టీడీపీ నేతలు అభిప్రాయంగా చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువగా వాలంటీర్ల మీదే ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలో వాళ్ళలో కొంత పర్సంటేజి అయినా.. అసంతృప్తి ఉంటే.. అది కచ్చితంగా తమకు ప్లస్ పాయింట్ అవుతుందనేది సదురు నేతల అంచనా. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళనే టార్గెట్ చేసుకుని మాట్లాడితే.. సానుకూల దృక్పధం పోయి.. వాళ్ళంతా ప్రభుత్వానికి సైనికుల్లా మారిపోతారని.. అలా మన మీద వ్యతిరేకతను మనమే కొనితెచ్చుకున్నట్టు కాదా అని వాదిస్తోందట ఆ వర్గం. వాలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా తన రాజకీయాల కోసం వినియోగించుకుంటున్న మాట వాస్తవమే అయినా.. దాన్ని పవన్ టచ్ చేశారు కాబట్టి.. ఈ వార్‌లోకి వెళ్లకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తే చివరికి అది మనకు కలిసొచ్చే అంశమే కదా అంటున్నారట ఆ వర్గం టీడీపీ నేతలు.

అయితే, ఆ వాదనతో ఇంకొందరు నేతలు విబేధిస్తున్నారట. గత కొద్ది రోజులుగా రాజకీయం మొత్తం వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగానే నడుస్తోందని గుర్తు చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉండి.. కీలకమైన అంశంలో తమ పాత్ర.. ప్రస్తావన లేకుండా రాజకీయం నడవడం అంత మంచిది కాదనేది పార్టీలో ఉన్న మరో వాదన. ఇప్పటికే వివిధ కారణాల వల్ల.. వివిధ సందర్భాల్లో కవరేజీ.. మైలేజీ టీడీపీ కంటే.. జనసేనకే ఎక్కువగా వస్తోందని, ఎన్నికల ముందు ఈ తరహా వాతావరణం కరెక్ట్ కాదనేది ఆ నేతల భావన. పైగా వలంటీర్ల వ్యవస్థపై పార్టీపరంగా టీడీపీకీ అనుమానాలు.. అభ్యంతరాలు ఉన్న సందర్భంలో దాని మీద గట్టిగా స్పందిస్తే తప్పేంటనే చర్చ జరుగుతోంది. మొత్తంగా చూస్తే.. వాలంటీర్స్‌ కేంద్రంగా జరుగుతున్న రాజకీయంపై టీడీపీలో భిన్నాభిప్రాయాలున్నాయన్నది మాత్రం వాస్తవం. అందుకే.. మధ్యే మార్గంగా హ్యుమన్ ట్రాఫికింగ్‌తో సంబంధం లేకుండా.. ఈసారి పవర్‌లోకి వస్తే.. వ్యవస్థను కొనసాగిస్తామని చెబుతూనే వాలంటీర్ల చేస్తున్న తప్పుల్ని ఎత్తిచూపే ప్రయత్నంలో ఉందట ప్రధాన ప్రతిపక్షం.