Kethamreddy Vinod Reddy: నెల్లూరు జిల్లాకు చెందిన జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. వినోద్ రెడ్డితో వైసీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చర్చలు జరిపి పార్టీలోకి రావాలని ఆహ్వానించడంతో ఆయన అంగీకరించారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో త్వరలోనే వైసీపీ తీర్థాన్ని వినోద్ రెడ్డి పుచ్చుకోనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. పార్టీలో చురుకైన నేతగా గుర్తింపు పొందిన వినోద్ రెడ్డి.. ‘పవనన్న ప్రజా బాట’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. గత కొద్దిరోజులుగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయన వైసీపీలోకి ఆహ్వానించడంతో వినోద్ రెడ్డి అంగీకరించినట్టు తెలిసింది.
Also Read: TDP: 14 మంది సభ్యులతో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నియామకం
జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు కుదరడంతో ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నెల్లూరు నగరం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ నెల్లూరు సిటీ టీడీపీ ఇంఛార్జిగా మాజీ మంత్రి నారాయణను ఆ పార్టీ ప్రకటించింది. దీంతో వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు ఆయన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసేందుకు అవకాశాలు లేకపోవడంతో వైసీపీలోకి వచ్చేందుకు అంగీకరించినట్టు సమాచారం.