Site icon NTV Telugu

Off The Record: జనసేనకు వెన్నుపోట్లు?.. పవన్‌ కళ్యాణ్ స్పెషల్‌ క్లాస్‌ పీకారా?

Janasena Nellore

Janasena Nellore

జనసేన సంస్థాగత నిర్మాణంపై పవన్‌కళ్యాణ్‌ దృష్టి పెట్టారా? అందుకే ఆ జిల్లాలో నేనే బాస్ అన్నట్టు వ్యవహరిస్తున్న నేతకు చెక్‌ పెట్టారా? పార్టీ లైన్‌లో లేనప్పుడు ఎవరైతే నాకేంటి అంటూ తోక కత్తిరించేశారా? ఏ జిల్లాలో జరుగుతోందా వ్యవహారం? ఏ నాయకుడి విషయంలో పైకి కనిపించని కత్తిరింపులు చేశారు పవన్‌?

రాష్ట్ర మంతటా సంస్థాగతంగా బలపడే ప్రయత్నాల్లో ఉన్న జనసేనకు నెల్లూరు జిల్లాలో వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయట. సొంతోళ్ళ వెన్నుపోట్లే అందుకు కారణం అన్నది పార్టీ వర్గాల ఇంటర్నల్‌ టాక్‌. అందుకే జిల్లా మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పార్టీ అధిష్టానం.. సీనియర్‌ లీడర్‌ అజయ్‌కుమార్‌కి చెక్‌ పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. జిల్లాలో పార్టీ కోసం కాకుండా… తనకంటూ వర్గాన్ని ఏర్పాటు చేసుకుని, అంతా నా కనుసన్నల్లోనే జరగాలని ఆదేశాలు ఇచ్చిన అజయ్ కుమార్‌కి పవర్స్‌ అన్నీ కట్‌ చేశారట. ఆయన వ్యవహార శైలి గురించి జిల్లాలోని నియోజకవర్గ ఇన్చార్జిలంతా.. మూకుమ్మడిగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేయడంతో… అమరావతికి పిలిపించి గట్టిగా క్లాస్‌ పీకినట్టు సమాచారం. ఆ తర్వాతే క్షేత్రస్థాయి పరిస్థితులను.. నేతల వ్యవహార శైలిని స్వయంగా తెలుసుకోవాలంటూ… ఎంఎస్‌ఎంఈ రాష్ట్ర చైర్మన్ శివ శంకర్‌ను జిల్లాకు పంపారట పవన్‌. అలాగే.. జనసేనలో ఉన్నారా? టీడీపీలో ఉన్నారా అన్నది అర్ధంకానంతగా తెలుగుదేశానికి సపోర్ట్‌ చేస్తున్న వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. పార్టీ అంతర్గత విషయాలను టిడిపి నేతలకు చేరవేసే వారి జాబితాను సైతం సిద్ధం చేశారన్న ప్రచారం జరుగుతోంది.

Also Read: Off The Record: తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. ఇప్పటి నుంచే బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని సిద్ధం చేస్తోందా?

జనసేన బలోపేతానికి పనిచేయకుండా.. గ్రూపులను తయారు చేస్తున్న అజయ్ కుమార్‌ను జిల్లా బాధ్యతల నుంచి తప్పించారన్న టాక్ పార్టీలో బలంగా ఉంది. జిల్లా అధ్యక్ష పదవి ఇప్పిస్తానంటూ ఓ నేతను పార్టీలోకి తీసుకున్న అజయ్ కుమార్.. అతని చేత బాగానే ఖర్చు చేయించారట. దీంతో ఆ నాయకుడు కూడా పరిశీలన కోసం జిల్లాకి వచ్చిన MSME ఛైర్మన్ శివ శంకర్‌ దగ్గర ఆవేదన వెళ్లగక్కినట్టు తెలిసింది. ఇక కార్యకర్తల ఫిర్యాదుల సంగతైతే చెప్పేపనేలేదు. ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత ఇన్ యాక్టివ్‌గా ఉన్న నేతలందరితో శివశంకర్ మాట్లాడి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడానికి కారణాలను తెలుసుకున్నారట. ఇదే సమయంలో జిల్లా అధ్యక్ష బాధ్యతలు పాత వారికి ఇవ్వాలా లేదా..? పక్క పార్టీల నుంచి నేతలను ఆహ్వానించి అప్పగించాలా అనే ఆలోచనలో పవన్ ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తల్లో కార్పొరేషన్ పరిధిలోని పలువురు నేతలు జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నా.. వారిని చేర్చుకోవడానికి అజయ్ కుమార్‌ ఆసక్తి చూపలేదని, వాళ్ళంతా టీడీపీలోకి వెళ్ళిపోయారని చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లోనే… టిడ్కో చైర్మన్, పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌గా ఉన్న వేములపాటి అజయ్ కుమార్‌ను నెల్లూరు రాజకీయాలకు దూరం పెట్టేశారన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల జిల్లా నేతలతో నిర్వహించిన సమావేశంలో కూడా అజయ్ కుమార్ తీరుపై జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేశారట. అంతర్గత విభేదాలు ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకురావాలే తప్ప.. వాటికి ఆజ్యం పోసే విధంగా వ్యవహరించవద్దని సూచించినట్టు తెలిసింది.

దాదాపు నెల రోజుల నుంచి అజయ్ కుమార్ జిల్లా రాజకీయాలకు దూరంగా ఉండటానికి అదే కారణమని అంటున్నారు. జనసేనకు మొదటి నుంచి అండగా ఉన్న నేతలందరినీ యాక్టివ్ చేయడంతో పాటు వలసల్ని కూడా ప్రోత్సాహించాలనుకుంటున్నారట. జిల్లాలో పార్టీ బలోపేతంలో భాగంగానే అజయ్‌ని తప్పించారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఐదేళ్లు పోరాటాలు చేసిన నేతలకు పదవులు దక్కకపోవడంపై చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. ఇక నుంచి వారికి కూడా పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది. శివశంకర్ ఇచ్చే నివేదిక ఆధారంగా ఒకరిద్దరు నేతలపై చర్యలు తీసుకుని.. ప్రాధాన్యం ఇవ్వాల్సిన వాళ్ళకు ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. తాను జిల్లాలో పర్యటిస్తానని, అంతకంటే ముందే… తోక జాడించే వారి పట్ల కఠినంగా వ్యవహరించి కటింగ్స్‌ పెట్టేయమని జిల్లా నాయకులకు సమాచారం పంపారట పవన్‌. జిల్లాలో టిడిపి ఎమ్మెల్యేలకు, జనసేన ఇన్చార్జిలకు మధ్య కొన్ని నియోజకవర్గాలలో అంతర్గత విభేదాలు ఉన్నాయి. వాటి మీద కూడా దృష్టి పెట్టి కలసి పనిచేసేలా ఆదేశాలిచ్చారట పవన్‌. మొత్తం మీద సింహపురి రాజకీయాల్లో జనసేనను కీలకంగా మార్చే క్రమంలోనే… క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్‌ మీదే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

Exit mobile version