NTV Telugu Site icon

Pawan Kalyan: 2024లో వైసీపీ ప్రభుత్వం ఉండదు, మన సర్కారే..

Pawan Kalyan Vararhi

Pawan Kalyan Vararhi

Pawan Kalyan: 2024లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఉండదు.. వచ్చేది మన ప్రభుత్వమే అని నమ్మకాన్ని వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. వారాహి విజయయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ జగన్‌ను టార్గెట్‌ చేశారు.. మరోసారి వాలంటీర్‌ వ్యవస్థపై విరుచుకుపడ్డారు.. వాలంటీర్స్ ఏ అధికారం ఉందని అప్లికేషన్స్ తీసుకుంటున్నారు అని జస్టిస్ బట్టు ప్రశ్నించారని.. ప్రజల డేటా వెళ్లిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు..? ఐదు వేలు ఇచ్చి శ్రమ దోపిడీ చేస్తున్నారని ఒక హైకోర్టు న్యాయమూర్తి అభిప్రాయం అన్నారు.. FOA అనే ఏజెన్సీ కి వాలంటీర్ ఇచ్చే సమాచారం చేరుతుంది. దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తాడేపల్లిగూడెం ఎఱ్ఱకాలువ గండ్లు కూడా పూడ్చలేక పోయారు. పోలవరం పూర్తి చేయలేకపోయారు. ఉపాధి లేకపోతే యువత రోడ్లు ఎక్కక ఏం చేస్తారు అని ప్రశ్నించారు పవన్‌.. పన్నులు తప్ప పనులు చేయరు అని ఆరోపించారు. తల్లి, చెల్లి మీద గౌరవం లేని వాళ్లకు నా భార్య మీద గౌరవం ఏం ఉంటుందని మండిపడ్డారు. విప్లవ కారుడుతో యుద్ధం ఎలా ఉంటుంది అనేది చూపిస్తా అని హెచ్చరించారు. మహిళలు బయటికి వస్తే సంబంధాలు అంటగట్టేస్తారు.. భారతి గారు మీ ఆయన్ని నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పండి, మీకు ఆడ పిల్లలు ఉన్నారు అని సూచించారు. ఇక, 2024లో వైసీపీ ప్రభుత్వం ఉండదు, మన ప్రభుత్వం వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు పవన్‌ కల్యాణ్. ఇక, సీఎం జగన్‌ను ఏకవచనంతో పిలవడానికి కారణం ఆయనకి ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోలేదు గనేకే అన్నారు పవన్‌.. మీరు మా కుటుంబాన్ని, జనసేన వీర మహిళలను కించ పరిచినా ఏం మాట్లాడ లేదు.. పెళ్లాం, పెళ్లాం అని మాట్లాడతావ్ ఏంటి జగన్‌? ఇలాంటివి భరించాల్సి వస్తుంది అని చెప్పా.. చిన్న పిల్లల కార్యక్రమంలో భార్య గురించి మాట్లాడే అంత సంస్కార హీనులా మీరు? అంటూ ప్రశ్నించారు.

వాలంటీర్స్ అంత నాసోదర సమానులు.. మీకు 5వేలు వస్తే మరో ఐదు వేలు వేసి ఇచ్చే మనస్తత్వం నాది అన్నారు పవన్‌.. కానీ, వాలంటీర్స్ వ్యవస్థ అవసరమా అనే నేను ప్రశ్నించేది.. అన్నారు. వాలంటీర్స్ అంటే ఏ మాత్రం డబ్బు ఆశించకుండా పని చేసే వారు.. రెడ్ క్రాస్ వాలంటీర్స్ కు అధిపతులు ఉన్నారు.. మీ వాలంటీర్ వ్యవస్థ కు అధిపతి ఎవరు.? అని నిలదీశారు. మరోవైపు.. వాలంటీర్స్ ఇచ్చే సమాచారం హైదరాబాద్ లో ఎందుకు పెట్టారు.? వాలంటీర్స్ వ్యవస్థ ఉపయోగించే విధానం పైన మాట్లాడుతున్నాం.. వాలంటీర్స్ చేసిన అఘాయిత్యాలకు ఎవరు బాధ్యత వహిస్తున్నారు.. వాలంటీర్స్ ఎర్ర చందనం తరలింపు లో పట్టుబడ్డారు.. చిన్నారుల పై అఘాయిత్యాలు చేస్తున్న వారికి కాళ్ళు కడిగి దైవాంశ సంభూతులు అంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.