Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్‌ విచారణ

Jammu Kashmir

Jammu Kashmir

Jammu Kashmir: కశ్మీరీ పండిట్లపై దశాబ్దాల క్రితం జరిగిన అత్యంత ఘోరమైన నరమేధాలపై జమ్మూ కశ్మీర్‌ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (SIA) విచారణను పునఃప్రారంభించింది. దాదాపు 28 ఏళ్ల క్రితం 1998లో 23 మంది కశ్మీరీ పండిట్లను దారుణంగా హత్య చేసిన వంధామ (Wandhama) ఊచకోత కేసులో దర్యాప్తు వేగం పుంజుకుంది. లోయలో ఉగ్రవాదం పరాకాష్ఠకు చేరిన సమయంలో జరిగిన ఈ కీలక హత్యల వెనుక ఉన్న నిజమైన హంతకులను, వారికి సహకరించిన వారిని గుర్తించడమే లక్ష్యంగా SIA అధికారులు లోయలో పలు ప్రాంతాల్లో ఇటీవలే విస్తృత సోదాలు నిర్వహించారు. 1998 జనవరి 25న, రిపబ్లిక్ డే ముందు రోజు రాత్రి గాందర్‌బల్ జిల్లాలోని వంధామ గ్రామంలోకి అత్యాధునిక ఆయుధాలతో ప్రవేశించిన ఉగ్రవాదులు.. కశ్మీరీ పండిట్ల ఇళ్లలోకి జొరబడి 9 మంది మహిళలు, 4 గురు పిల్లలు సహా 23 మందిని అత్యంత దారుణంగా కాల్చి చంపారు. పవిత్ర రంజాన్ మాసంలోని షబ్-ఎ-ఖదర్ రాత్రివేళ జరిగిన ఈ భయంకర దాడులు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని ఈ కేసును SIA ఇప్పుడు సీరియస్‌గా తీసుకొని తవ్వితీస్తోంది.

కేవలం వంధామ ఘటనే కాకుండా, మరికొన్ని ప్రముఖ పండిట్ నేతల హత్యల కేసులను కూడా ఏజెన్సీ తన రీసెర్చ్ పరిధిలోకి తెచ్చింది. 1989 సెప్టెంబర్‌లో శ్రీనగర్‌లోని తన నివాసం వద్ద దారుణ హత్యకు గురైన ప్రముఖ న్యాయవాది, నాటి జమ్మూ కశ్మీర్‌ బీజేపీ ఉపాధ్యక్షుడు టికా లాల్ ట్యాప్లూ కేసును SIA వేగవంతం చేసింది. అలాగే జేకేఎల్ఎఫ్ (JKLF) ఉగ్రవాది మక్బూల్ భట్‌కు మరణశిక్ష విధించిన జస్టిస్ నీలకాంత్ గంజూను 1989 నవంబర్ 4న శ్రీనగర్‌లోని హరిసింగ్ స్ట్రీట్‌లో కాల్చి చంపిన ఘటనపై కూడా బృందాలు లోతుగా విచారిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా కశ్మీరీ పండిట్లపై జరిగిన పాత నేరాల ఫైళ్లను తెరుస్తున్న ఏజెన్సీ, ఇటీవలే 1990 నాటి నర్స్ సర్లా భట్ హత్య కేసులో 737 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. అందులో జైలులో ఉన్న జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్‌ను ప్రధాన సూత్రధారిగా పేర్కొంది. అంతేకాకుండా ప్రముఖ రచయిత సర్వానంద్ కౌల్ ప్రేమీ, ఆయన కుమారుడు వీరేందర్ కౌల్‌ల దారుణ హత్య కేసుకు సంబంధించి కూడా జమ్మూ కశ్మీర్‌‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఏళ్ల తరబడి మూలనపడ్డ ఉగ్ర ఘటనల వెనుక ఉన్న అసలు సూత్రధారులు, వారి సహచరులకు చట్టపరంగా శిక్ష పడేలా SIA తన విచారణ చక్రాన్ని తిప్పుతోంది.