NTV Telugu Site icon

SCO Summit 2024: కజకిస్తాన్‌లో ఎస్‌సీవో సమ్మిట్‌కు ప్రధాని మోడీ దూరం

Sco Summit

Sco Summit

SCO Summit 2024: కజకిస్థాన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ హాజరు కావడం లేదు. ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ భారత్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దీనికి హాజరవుతారు. ఇక్కడకు వచ్చే ప్రపంచ నాయకులను విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్ కలవనున్నారు. SCO శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌లను ఆయన కలుస్తారు. మేలో పుతిన్ చివరిసారిగా జిన్‌పింగ్‌ను కలిశారు. ఐదోసారి రష్యా అధ్యక్షుడయ్యాక చైనా వెళ్లారు.

Read Also: CM Stalin: కచ్చతీవును ఇంకెప్పుడు స్వాధీనం చేసుకుంటారు.. ప్రధానిపై స్టాలిన్ ఫైర్..!

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీవో) ఒక రాజకీయ, ఆర్థిక, సైనిక సంస్థ. ఇది 2001లో ఏర్పడింది. దీంట్లో చైనా, రష్యా, కజకిస్థాన్, కిర్గిజిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇది మొదట 1996లో ‘షాంఘై ఫైవ్’గా ఏర్పాటైంది. 2001లో ఉజ్బెకిస్థాన్ చేరడంతో షాంఘై సహకార సంస్థగా పేరు మార్చారు. దీని ప్రధాన కార్యాలయం చైనా రాజధాని బీజింగ్‌లో ఉంది. టర్కీ ఎస్‌సీవోలో సభ్యదేశం కానప్పటికీ, తరచుగా సమావేశాలలో సంభాషణ భాగస్వామిగా పాల్గొంటుంది. ఎస్‌సీవో సమ్మిట్‌లో పాల్గొనేందుకు భారతదేశం తరపున విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ అస్తానా చేరుకున్నారు.

భారత విదేశాంగ మంత్రికి స్వాగతం పలికేందుకు కజకిస్థాన్ ఉప విదేశాంగ మంత్రి అలీబెక్ బకాయేవ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎస్‌సీవో సమ్మిట్ జూలై 3-4 తేదీలలో జరుగుతుంది. కజకిస్థాన్ అధ్యక్షతన జరుగుతున్న షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ)కు ఇది 24వ సమావేశం. సమావేశానికి ముందు గ్రూపింగ్ నాయకులు గత రెండు దశాబ్దాలుగా తమ కార్యకలాపాలను సమీక్షించవచ్చని, బహుపాక్షిక సహకారం అవకాశాలను చర్చించే అవకాశం ఉందని భారతదేశం మంగళవారం తెలిపింది. ఈ శిఖరాగ్ర సమావేశంలో, ఆఫ్ఘనిస్తాన్, ఉక్రెయిన్ వివాదం, ఎస్‌సీవో సభ్య దేశాల మధ్య పెరుగుతున్న భద్రతా సహకారంపై చర్చించే అవకాశం ఉంది.

కజకిస్తాన్ ఉప ప్రధానిని కలిసిన జైశంకర్
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం కజకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి మురత్ నూర్తాలేయుతో సమావేశమై వ్యూహాత్మక భాగస్వామ్య విస్తరణ, వివిధ ఫార్మాట్లలో మధ్య ఆసియాతో భారత్‌కు పెరుగుతున్న సహకారంపై చర్చించారు. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై జైశంకర్ నూర్తలేయుతో అభిప్రాయాలను పంచుకున్నారు. నూర్తాలేయు విదేశాంగ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.