Himachal Pradesh Results: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ మార్క్‌ను దాటింది. 68 మంది సభ్యులు గల హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కాంగ్రెస్ 40 స్థానాల్లో విజయం సాధించింది. 25 స్థానాల్లో బీజేపీ గెలవనుంది. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ ఓటమిని అంగీకరించారు. గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామన్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. గత ఐదేళ్లలో తనకు సహకరించిన ప్రధాని మోడీకి, కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి పాటుపడతామని ఆయన స్పష్టం చేశారు.
పదవిలో లేకున్నా ప్రజల కోసం ఎప్పుడూ పనిచేస్తామని ఆయన చెప్పారు. కొన్ని అంశాలు తమ ఓటమికి కారణమయ్యాయని.. వాటిని విశ్లేషించుకుంటామని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ ప్రజలు 1985 నుంచి అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వానికి కూడా వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని కట్టబెట్టలేదు. ఈ సారి కూడా అదే సంప్రదాయాన్ని పాటించడం గమనార్హం. ఇదిలా ఉంటే విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అవుతారోనని ఆసక్తి నెలకొంది. ఈ పేర్లలో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి,హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వీరభద్ర సింగ్ భార్య ప్రతిభాసింగ్ పేర్లు చక్కర్లు కొడుతోంది. సీఎం పదవిని అనేక మంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం పార్టీ హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. అయితే ముఖ్యంగా ఐదుగురి పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి. వారిలో ప్రతిభా సింగ్, సుఖ్వీందర్ సింగ్ సుఖు, ముఖేష్ అగ్నిహోత్రి, ఠాకూర్ కౌల్ సింగ్, ఆశా కుమారి ఉన్నారు.
Gujarat Assembly Polls Results: కాంగ్రెస్‌కు మరోదెబ్బ.. గుజరాత్‌లో ప్రతిపక్ష హోదా కూడా కష్టమే..
మరోవైపు గెలిచిన ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాంగ్రెస్ జాగ్రత్తపడుతోంది. హిమాచల్‌ప్రదేశ్ ఇన్‌ఛార్జ్ రాజీవ్ శుక్లా, ఏఐసీసీ పరిశీలకులు, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడాను సిమ్లాకు పంపించింది. పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను చండీగఢ్‌కు తరలించనున్నట్లు రాజీవ్ శుక్లా తెలిపారు. అక్కడే శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.