Haribabu Murder: జగిత్యాల జిల్లాకు చెందిన యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు బయటకు వచ్చాయి. “నేనే హత్య చేశాను” అంటూ వైష్ణవి సోదరుడు సంతోష్ పోలీసులకు లొంగిపోయాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. “నా చెల్లెను చంపినందుకు చంపేశా. నేను పోలీస్ స్టేషన్‌లో లొంగిపోతున్నా. మా ఇంట్లో జరిగినట్లు ఏ ఇంట్లోనూ జరగవద్దని చంపాను. నేను ఓ పనినిమిత్తం నిజామాబాద్ వచ్చా. అనుకోకుండా హరిబాబు కనిపించడంతో హత్య చేశా.” అని కీలక విషయాలను వీడియోలో పంచుకున్నాడు.
అసలు ఏం జరిగింది?
జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన హరిబాబు.. తన భార్య వైష్ణవి (19)ని ప్రేమవివాహం చేసుకున్నాడు. కానీ.. మార్చి 17న ఆమె 4 నెలల గర్భిణిగా ఉన్నప్పుడు గొంతు నులిమి, కత్తితో పొడిచి చంపాడు. ఈ కేసులో రెండ్రోజుల తర్వాత అరెస్టయి, ఆగస్టు 15న బెయిల్‌పై విడుదలైన హరిబాబు ప్రాణభయంతో అనంతపురంలో గణేష్ విగ్రహాల తయారీ కేంద్రంలో పనిచేస్తున్నాడు. బెయిల్‌పై బయటకొచ్చిన అతని తల్లి లక్ష్మి నిజామాబాద్‌లోని ఇంద్రాపూర్ కాలనీలో అద్దెకుంటూ రాజరాజేంద్ర చౌరస్తా వద్ద మొక్కజొన్నలు విక్రయిస్తోంది. తల్లిని చూడటానికి నిజామాబాద్ వచ్చిన హరిబాబు, గురువారం (సెప్టెంబర్ 17న) సాయంత్రం పానీపూరి బండి వద్ద నీళ్లు తాగుతుండగా వైష్ణవి సోదరుడు సంతోష్ కారులో వచ్చి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. కేవలం 10 సెకన్ల వ్యవధిలోనే తల, మెడ, నడుము భాగాల్లో 9 సార్లు కత్తితో దారుణంగా నరకడంతో హరిబాబు తీవ్ర రక్తస్రావమై తల్లి కళ్లముందే అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ భయానక హత్య దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డై తీవ్ర వైరల్‌గా మారాయి. కళ్లెదుటే కొడుకును నరికి చంపడంతో తల్లి లక్ష్మి తీవ్ర షాక్‌లోకి వెళ్లిపోవడమే కాకుండా ప్రాణభయంతో వణికిపోతోంది. మార్చి 17న భర్త చేతిలో వైష్ణవి దారుణ హత్యకు గురైతే, సరిగ్గా ఆరు నెలల తర్వాత సెప్టెంబర్ 17న వైష్ణవి సోదరుడి చేతిలోనే హరిబాబు హత్యకు గురికావడం గమనార్హం.

