Off The Record: ప్రతిపక్షాలు లేవు.. పత్తాకు లేదు. ఇక అధికార పార్టీకి ఎదురే లేదు. మొత్తం పంచాయతీలన్నీ మనవేనని అనుకుంటున్న కాంగ్రెస్‌కు అక్కడ అనుకోని అవాంతరాలు ఎదురవుతున్నాయట. నియోజకవర్గంలో జరుగుతున్న టామ్ అండ్ జెర్రీ వార్‌తో చివరికి కేడర్ కూడా గందరగోళంలో పడుతోంది. గెలిచినా, ఓడినా కాంగ్రెస్ పార్టీనే అయినప్పటికీ వర్గపోరు ఆ స్థాయికి దిగజారింది ఎక్కడ? ఎవరా ఇద్దరు నేతలు?
Read Also: Nayanathara: నయన్ మార్పు విలువ కోట్ల పైమాటే
జగిత్యాల.. నేతల మధ్య జగడాలతో తెలంగాణ పాలిటిక్స్‌లో నిత్యం ట్రెండింగ్‌లో ఉంటున్న నియోజకవర్గం. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, సిట్టంగ్ ఎమ్మెల్యే సంజయ్‌ల మధ్య రాజకీయ చిచ్చు రగులుతూనే ఉంది. పెద్దలు జీవన్‌రెడ్డి అవకాశం చిక్కిన ప్రతీసారి అఫెన్సివ్ స్ట్రాటజీ ప్లే చేస్తూ.. ఎమ్మెల్యేను ఇరకాటంలో పెట్టేందుకు తన అనుభవాన్నంతా వాడుతున్నారన్నది లోకల్ టాక్. జీవన్ రెడ్డిని వరుసగా రెండు సార్లు ఓడించిన సంజయ్ గత ఎన్నికల్లో గెలిచాక కార్ దిగి స్నేహ హస్తం అందించడంతో.. ఈ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి గడ్డు కాలం మొదలైంది. ఎమ్మెల్యే సంజయ్ ప్రభుత్వ పెద్దలకు దగ్గర కావడంతో పొలిటికల్ ఉక్కపోత ఫీలవుతున్నారట మాజీ మంత్రి. జగిత్యాలలో పట్టు కోసం 75 ఏళ్ళ వయసులోనూ పడరాని పాట్లు పడుతున్నారట పెద్దాయన. మొదట్లో ఆయన అలకల్ని సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగింపుల పర్వాన్ని నడిపినా.. అది రొటీన్ అయిపోవడంతో వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారట. దీంతో ఇంకాస్త స్పీడ్ పెంచిన జీవన్‌రెడ్డి.. సందు దొరికితే చాలు సొంత పార్టీపైనే రప్పా రప్పా స్టైల్లో విజృంభిస్తున్నారు.
Read Also: BSBD Account Benefits: జీరో బ్యాలెన్స్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..
ఇటీవల ప్రకటించిన డీసీసీ అధ్యక్షుల జాబితాలో జగిత్యాల డీసీసీని తన అనుచరుడికి ఇప్పించుకోగలిగారాయన. ఇక ఆ ఉత్సాహంతో ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో టాప్ గేర్ వేసినట్టు తెలుస్తోంది. ప్రతీ గ్రామంలో తన అనుచరులు బరిలో ఉండేలా జాగ్రత్త పడుతున్నారట. అదే సమయంలో ఎన్ని కవ్వింపులు వచ్చినా.. కామ్ గోయింగ్ అన్నట్టుగా ఎమ్మెల్యే సంజయ్ తన పని తాను చేసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో తన అనుచరులను.. కలిసి వస్తున్న పాత కాంగ్రెస్ వారిని కలుపుకుని అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత మండల నేతలకే ఇచ్చేశారట ఎమ్మెల్యే. ఏ సాయం కావాలో అడగండి.. తప్పకుండా చేస్తానంటూ అభ్యర్థులకు భరోసా ఇవ్వడంతో గ్రామాల్లో పోరు రసవత్తరంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో పోటీ అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్షాలకు బదులుగా కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే మారిపోయింది.
మరోవైపు జగిత్యాలలో ప్రస్తుతం ప్రతిపక్షాలు పూర్తిగా వీక్ కావడంతో ఆ ప్రభావం సర్పంచ్ ఎన్నికలపై స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్‌కు నాయకుడు లేకపోవడంతో క్యాడర్ సైలెంట్ మోడ్‌లో ఉంది. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవుతారంటూ ప్రచారం జరిగిన మాజీ జడ్పీ చైర్‌పర్సన్ ద్యావ వసంత ఓ అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. గతంలో ఎమ్మెల్సీ కవితకు సన్నిహితంగా ఉన్న వసంత దంపతులను ఇప్పుడు మారిన పరిస్థితుల్లో పార్టీ పెద్దలు అంతగా విశ్వసించడం లేదని తెలుస్తోంది. దానికి తోడు ఆమె వ్యవహార శైలిపై ద్వితీయ శ్రేణి నేతలు అసంతృప్తిగా ఉన్నట్టు చెబుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జోక్యం చేసుకుని ఎమ్మెల్సీ ఎల్.రమణకు బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగింది అప్పట్లో. కానీ… అటు రమణ తరచూ రాక.. ఇటు వసంత పట్టించుకోక కార్ క్యాడర్ కకావికలం అవుతోంది. జగిత్యాల నియోజకవర్గంలో ఎక్కడా బీఆర్ఎస్ ప్రభావం కనిపించడం లేదనే అభిప్రాయం బలంగా ఉంది. ద్యావ వసంత సొంత గ్రామమైన తిప్పన్నపేటలో కూడా ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థి బరిలో లేరంటే పరిస్థితిని ఊహించుకోవచ్చంటున్నారు పరిశీలకులు.
మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఓటింగ్ సాధించిన బీజేపీ పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది. నియోజకవర్గ ఇంచార్జ్ భోగ శ్రావణి జగిత్యాల నుంచి జెండా ఎత్తేసి హైదరాబాద్‌కి షిప్ట్ అవడంతో పార్టీని పట్టించుకునే నాయకుడు లేకుండా పోయారు. అక్కడక్కడా వార్డు సభ్యులుగా, సర్పంచ్‌లుగా కమలం అభ్యర్థులు ఉన్నప్పటికీ అంతగా ప్రభావం కనిపించడం లేదంటున్నారు. ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఇలా ఉంటే.. అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన అధికార పార్టీలో మాత్రం ఆధిపత్య పోరుతో నువ్వా నేనా అన్నట్టుగా ఫైట్ చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే, మాజీ మంత్రి తమ మనుషులే గెలవాలంటూ పావులు కదపడం కాంగ్రెస్‌లోని వర్గపోరును మరోసారి బయటపెడుతోంది. ఎమ్మెల్యే సంజయ్… తనదైన శైలిలో.. అంతా కలిసి పనిచేయాలని చెబుతూ సమన్వయం చేస్తున్నారట.. దీంతో ఆయన బలపరిచిన వారు కాస్త ముందంజలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.సమీకరణలు ఒక్కసారిగా ఛేంజ్ కావడంతో తన మనుషులను గెలిపించుకోవడం జీవన్‌రెడ్డికి జీవన్మరణ సమస్యగా మారిందనేది విశ్లేషకుల మాట.ప్రతిపక్షాలు చేతులెత్తేసిన తరుణంలో జగిత్యాల పంచాయతీ పోరులో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.
