Jacqueline Fernandez: మనీలాండరింగ్ కేసులో సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్న రూ.200కోట్ల దోపిడీ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సోమవారం ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆమెను విచారించడానికి రెండోసారి సమన్లు పంపినట్లు అధికారులు తెలిపారు. నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ విచారణకు హాజరయ్యారని, మందిర్ మార్గ్‌లోని ఆర్థిక నేరాల విభాగం కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారని సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. గత బుధవారం జాక్వెలిన్‌ను చంద్రశేఖర్‌కు పరిచయం చేసిన వ్యక్తి పింకీ ఇరానీతో పాటు ఎనిమిది గంటలకు పైగా ప్రశ్నలు సంధించారు.
Mamata Benerjee: బెంగాల్ ముఖ్యమంత్రి మమతకు ఊహించని షాక్..
సుకేశ్ చంద్రశేఖర్ నుంచి ఆమె అందుకున్న ఖరీదైన బహుమతులు, ఇతర ఆర్థిక లావాదేవీల గురించి ఆమెను ఆరా తీసినట్టు సమాచారం. దీనికి సంబంధించి గతంలోనే దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆమెకు పలుమార్లు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఆమెను నిందితురాలిగా పేర్కొన్న ఈడీ.. ఇటీవల దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్‌షీట్‌లోనూ జాక్వెలిన్ పేరును చేర్చింది. దోపిడీ చేసిన డబ్బు నుంచి నటి లబ్ధి పొందినట్లు దర్యాప్తులో గుర్తించామని ఈడీ వర్గాలు వెల్లడించాయి. సుకేశ్ చంద్రశేఖర్ దోపిడీదారు అని జాక్వెలిన్‌కు ముందే తెలుసని, అయినా అతడితో సాన్నిహిత్యం కొనసాగించారని సదరు వర్గాలు పేర్కొన్నాయి. అంతేగాక, సుకేశ్ అరెస్టయిన తర్వాత జాక్వెలిన్ సాక్ష్యాలను చెరిపేసేందుకు ప్రయత్నించినట్లు తెలిపాయి. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన ఈడీ.. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆమెకు చెందిన రూ.7.27కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది.
