Site icon NTV Telugu

Italy PM: ఇటలీ తొలి మహిళా ప్రధానిగా జార్జియా మెలోని!

Giorgia Meloni

Giorgia Meloni

Italy PM: ఇటలీ ప్రధాని పీఠాన్ని ఆ దేశ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ అధిష్టించనున్నారు. నేషనలిస్ట్ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన అధినేత్రి జార్జియా మెలోని ఎన్నికల్లో విజయం సాధించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీకి మహిళ ప్రధాని కావడం ఇదే మొదటిసారి. ఎన్నికల ఫలితాల సరళిని చూస్తే పార్లమెంటు ఉభయ సభల్లోనూ నేషనలిస్ట్ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీయే మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది. ముఖ్యంగా చాలా కాలం తర్వాత ఇటలీలో రాజకీయ సుస్థిరతకు తాజా ఎన్నికలు వీలు కల్పించాయి. అయితే, కొత్త ప్రధానికి ఎన్నో సవాళ్లు ఎదురు కానున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం తర్వాత ఇంధన ధరల మంటను ఇటలీ ఎక్కువగా చవిచూస్తోంది. యూరోప్ లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. వీటిని ఆమె సరిదిద్దాల్సి ఉంది. ‘మనం ఆరంభ స్థాయిలోనే ఉన్నాం. రేపటి రోజు నుంచి మనం ఏంటో నిరూపించుకోవాల్సి ఉంది’ అని 45 ఏళ్ల జార్జియా మెలోనీ తన పార్టీ మద్దతుదారులతో సోమవారం ఉదయం పేర్కొన్నారు.

Maa Robot: దివ్యాంగులైన కుమార్తె కోసం దినసరి కూలీ సరికొత్త ఆవిష్కరణ

ఈ ఎన్నికల్లో నియోఫాసిస్ట్ మూలాలు ఉన్న బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి అత్యధిక సీట్లు సాధిస్తుందని అంచనాలున్నాయి. ఇదే వాస్తవమైతే ఇటలీ చరిత్రలో తొలిసారిగా మహిళ ప్రధాని బాధ్యతలను చేపట్టబోతున్నారు. బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీ నాయకురాలు జార్జియా మెలోని ప్రచారంతో ప్రధాన ఆకర్శణగా నిలిచారు. రెండు వారాల క్రితం నిర్వహించిన చివరి ఒపీనియన్ పోల్‌లో మెలోని నేతృత్వంలోని బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ విజయం సాధిస్తుందని తేలింది. అంతేకాకుండా జార్జియా తనదైన శైలితో అందర్ని ఆకట్టుకుందని పలువురు పేర్కొంటున్నారు. కాగా, 2018లో జరిగిన ఎన్నికలలో మెలోని పార్టీ కేవలం 4 శాతం ఓట్లను మాత్రమే గెలుచుకున్నా, మూడేళ్ల కాలంలోనే అనూహ్యంగా పుంజుకుంది. ఆ పార్టీకి 47 శాతం ఓట్లు వస్తాయని భావిస్తున్నారు.. కాగా అక్టోబర్ 13 వరకు కొత్త పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి.. ఈ సమావేశాల్లోపు తదుపరి ప్రభుత్వం అధికారం చేపట్టే అవకాశం ఉంది.

Exit mobile version