నేటి రాజకీయాలలో చదువుకున్న వాళ్లకు కూడా వెలకట్టే పరిస్థితి వచ్చిందని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. వరంగల్ జిల్లా ఏకశిలా నగర్‌లో జరిగిన యూత్ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. మనం ఎమ్మెల్యేలను, ఎంపీలను, కార్పొరేటర్లను ఎన్నుకుంటున్నాము… వాళ్లు సరిగ్గా పని చేస్తే మనకు సంతోషం. కానీ వారు డబ్బు మనుషులై ప్రజలను పీడిస్తే వీడికి ఎందుకు ఓటేశామురా అని బాధ పడతామన్నారు. పట్టభద్రుల ఓట్లలో అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలన్నారు. ఓటేసే ముందే వారి నిజాయితీని తెలుసుకోవాలని తెలిపారు. రాష్ట్రభవిష్యత్తును, దేశ భవిష్యత్తును నిర్ణయించేది మన ఓటు హక్కేనని గుర్తించాలన్నారు.
READ MORE: Aadhaar Of Dead Person: అసలు మరణించిన వ్యక్తి ఆధార్ ఏమవుతుందో తెలుసా..
మీ అరచేతిలోని సెల్‌ఫోన్‌లో దేశంలో జరిగే ప్రతీ విషయం తెలుసుకుంటున్నారని.. ప్రధాని మోడీ గురించి మీకే ఎక్కువ తెలుసని ఈటల రాజేందర్ అన్నారు. కరోనా కాలంలో ఆయన ఇతర దేశాల నాయకులలాగ కన్నీళ్లు పెట్టకుండా ప్రజలకు ధైర్యం చెప్పి, వ్యాక్సిన్ ఇప్పించి కరోనా భయం లేకుండా చేసిన గొప్ప ప్రధాని అని కొనియాడారు. అయోధ్య రామమందిరాన్ని ప్రపంచం మెచ్చుకునే రీతిలో వైభవంగా కట్టించారని గుర్తుచేశారు. గ్రామీణ ప్రాంతాల మహిళలకు 12 కోట్ల టాయిలెట్లు కట్టించి వారి ఆత్మగౌరవాన్ని కాపాడారన్నారు. 4 కోట్ల మంది పేదలకు ఇల్లు కట్టించి సొంతింటి కల నెరవేర్చారని చెప్పారు. ప్రధాని మోడీ ప్రపంచంలోనే గొప్ప నాయకునిగా కీర్తించబడుతున్నారన్నారు. దేశంలో బాంబులు పేలకుండా ఉండాలంటే, దేశం సుభిక్షంగా ఉండాలంటే, ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే మోడీ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పునరుద్ఘాటించారు. ప్రేమేందర్ రెడ్డి 40 ఏళ్లుగా పార్టీని, ప్రజలను నమ్ముకుని సేవ చేస్తున్నారని.. వారిని గెలిపించాలని పట్టభద్ర ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
