Site icon NTV Telugu

Narayanan: ఆపరేషన్ సిందూర్‌కి 400 మందికి పైగా శాస్త్రవేత్తల కృషి.. ఇస్రో చీఫ్ కీలక వ్యాఖ్యలు..

Operation Sindoor

Operation Sindoor

ఆపరేషన్ సిందూర్ సమయంలో సహాయం అందించడానికి 400 మందికి పైగా శాస్త్రవేత్తలు 24 గంటలూ పనిచేశారని ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) ఛైర్మన్ వి నారాయణన్ మంగళవారం అన్నారు. సైనిక ఆపరేషన్ సమయంలో భూమి పరిశీలన, ఉపగ్రహాల కమ్యూనికేషన్ వంటి సహాయ సహకారాలు అందించారని తెలిపారు. ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (AIMA) 52వ జాతీయ మేనేజ్‌మెంట్ కాన్ఫరెన్స్‌లో నారాయణన్ ప్రసంగించారు. ఈ నేపథ్యంలో కీలక విషయాలను వెల్లడించారు. జాతీయ భద్రతా అవసరాల కోసం ఇస్రో ఉపగ్రహ డేటాను అందించిందని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఉపగ్రహాలు 24 గంటలూ పనిచేస్తూ సైనికులకు అవసరాలను తీర్చాయని వివరించారు. 400 మందికి పైగా శాస్త్రవేత్తలు పూర్తి సామర్థ్యంతో పగలు, రాత్రి తేడా లేకుండా పని చేశారని తెలిపారు.

READ MORE: Srisailam: శ్రీశైలం క్షేత్రంలో కలకలం.. ఆలయంపై మరోసారి ఎగిరిన డ్రోన్..!

‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా సాయుధ పోరాటాలలో అంతరిక్ష రంగం పాత్రపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని ఇస్రో చీఫ్ అన్నారు. ఈ సమయంలో డ్రోన్ల సామర్థ్యాలు, స్వదేశీ ఆకాష్ యారో వంటి వాయు రక్షణ వ్యవస్థలను విస్తృతంగా పరీక్షించినట్లు చెప్పారు. మానవ అంతరిక్ష మిషన్ గగన్‌యాన్ ప్రాజెక్ట్ కింద ఇప్పటివరకు 7,700 కి పైగా గ్రౌండ్ పరీక్షలు పూర్తయ్యాయని, రాబోయే మానవ అంతరిక్ష ప్రయాణానికి ముందు మరో 2,300 పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. గగన్‌యాన్ మిషన్ కింద, ఇస్రో మూడు మానవరహిత మిషన్లను నిర్వహిస్తుందని, వీటిలో మొదటిది ఈ ఏడాది డిసెంబర్‌లో జరుగుతుందని పేర్కొన్నారు. మరో రెండు మానవరహిత మిషన్లు జరుగుతాయన్నారు. గగన్‌యాన్ ప్రాజెక్ట్ కింద రెండు మానవ సహిత మిషన్‌లను నిర్వహించడానికి ఆమోదం లభించిందని.. 2035 నాటికి భారతదేశం స్వంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, 2040 నాటికి చంద్రునిపై భారతీయ వ్యోమగామిని దింపడం అనే లక్ష్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇస్రోకు అప్పగించారని నారాయణన్ వివరించారు.

READ MORE: Actor Darshan: ‘‘బట్టలు కంపు కొడుతున్నాయి, నాకు విషం ఇవ్వండి’’.. కోర్టును కోరిన కన్నడ స్టార్ దర్శన్..

Exit mobile version