NTV Telugu Site icon

GSLV F12: ఇస్రో ప్రయోగం విజయవంతం.. దీని వల్ల ఉపయోగం ఏంటి..?

Isro 2

Isro 2

GSLV F12: అంతరిక్షంలో సత్తా చాటుతోన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO).. మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.. ఈ రోజు శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి నావిగేషన్‌ శాటిలైట్‌ (navigation satellite) ను ప్రయోగించి విజయం సాధించింది.. ఎన్‌వీఎస్‌-01 ఉపగ్రహంతో ఉదయం 10:42 గంటలకు నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-12 వాహనకౌక.. నిర్ధిష్టమైన కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.. ఇక, ఈ ప్రయోగం ద్వారా భారత నావిగేషన్‌ వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు.. నావిగేషన్‌ సేవల కోసం గతంలో పంపిన వాటిలో నాలుగు ఉపగ్రహాల జీవిత కాలం ముగిసిపోగా.. వాటి స్థానంలో ప్రతి ఆరు నెలలకు ఒక ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపుతోంది ఇస్రో.. ఇక, జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-12 ప్రయోగం విజయవంతం కావడంతో శ్రీహరికోటోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లో శాస్త్రవేత్తల సంబరాలు అంబరాన్ని తాకాయి.. ఈ ప్రయోగంలో భాగస్వాములైన అందరికీ అభినందనలు తెలిపారు ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌.

ఇక, ఆదివారం ఉదయం 7.12 గంటలకు కౌంట్‌డౌన్‌ను శాస్త్రవేత్తలు ప్రారంభించగా.. మొత్తం 27.30 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–12 రాకెట్‌ను ప్రయోగించారు.. దీని ద్వారా 2,232 కిలోల బరువు కలిగిన నావిక్‌–01 ఉపగ్రహాన్ని రోదసిలోకి ప్రవేశపెట్టారు.. ఈ ప్రయోగం నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టం బలోపేతం కోసం చేస్తున్నారు.. భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నావిక్‌–01 పేరుతో నావిగేషన్‌ ఉపగ్రహ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. నావిక్‌–01 ఉపగ్రహం సరికొత్తగా ఎల్‌–5, ఎస్‌–బాండ్‌ల సిగ్నల్స్‌తో పనిచేసే విధంగా రూపొందించారు ఇస్రో శాస్త్రవేత్తలు.. ఈ ఉపగ్రహం వల్ల భూమి, జల, వాయు మార్గాల స్థితిగతులు, దిక్కులు తెలియజేయడం, ఆపద సమయాల్లో భూగోళానికి సంబంధించిన సమాచారం అందించడం, వాహనచోదకులకు దిశానిర్దేశం చేయడం, ఇంటర్నెట్‌తో అనుసంధానం లాంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా, జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 పొడవు 51.7 మీటర్లు. బరువు 420 టన్నులు. భారతదేశానికి చెందిన రెండో తరం నావిక్‌ ఉపగ్రహాల్లో ఎన్‌వీఎస్‌-01 మొదటిది. 2,232 కిలోల బరువున్న దీని జీవితకాలం 12 ఏళ్లు. ఈ ఉపగ్రహం భారత్‌ ప్రధాన భూభాగం చుట్టూ సుమారు 1500 కి.మీ పరిధిలో రియల్‌ టైమ్‌ పొజిషనింగ్‌ సేవలను అందిస్తుంది.

నావిక్ అంటే ఏమిటి?
నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్ (NavIC) అనేది ఇస్రో అభివృద్ధి చేసిన ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, ఇది కక్ష్యలో ఉన్న ఏడు ఉపగ్రహాల సమూహం, ఇది గ్రౌండ్ స్టేషన్‌లతో కలిసి పని చేస్తుంది. నెట్‌వర్క్ సాధారణ వినియోగదారులు మరియు వ్యూహాత్మక వినియోగదారులకు నావిగేషనల్ సేవలను అందిస్తుంది, అవి సాయుధ దళాలు. మెరుగైన పొజిషనింగ్, నావిగేషన్ మరియు టైమింగ్ కోసం దేశంలో పౌర విమానయాన రంగానికి పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవస్థ అభివృద్ధి చేయబడింది. నెట్‌వర్క్ భారతదేశంతో సహా ఒక ప్రాంతాన్ని మరియు భారత సరిహద్దును దాటి 1500 కిలోమీటర్ల వరకు పనిచేస్తోంది. ఇది భూసంబంధమైన, వైమానిక మరియు సముద్ర రవాణా, స్థాన-ఆధారిత సేవలు, వ్యక్తిగత చలనశీలత, వనరుల పర్యవేక్షణ, సర్వేయింగ్ మరియు జియోడెసీ, శాస్త్రీయ పరిశోధన, సమయ వ్యాప్తి మరియు సమకాలీకరణ మరియు భద్రత-ఆఫ్-లైఫ్ హెచ్చరిక వ్యాప్తిలో ఉపయోగించబడుతుంది.