ISRO: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను ఆదివారం ఎల్‌వీఎం-3 వాహకనౌక ద్వారా నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలు మార్చి 26న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఎల్వీఎం-3 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఎల్వీఎం-3 వాహకనౌక ద్వారా ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు కౌంట్‌డౌన్ మొదలైంది. గురువారం నిర్వహించిన రిహార్సల్స్ విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కౌంట్‌డౌన్ ప్రక్రియ శనివారం ఉదయం 9 గంటలకు మొదలై నిరంతరాయంగా 24 గంటలపాటు కొనసాగిన పిదప ఎల్‌వీఎం-3 రాకెట్ ఆదివారం 9 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది.
Read Also: Zakir Naik: హిందువులు నన్ను ఎంతగానో ప్రేమిస్తారు.. ఇస్లామిక్ బోధకుడి కీలక వ్యాఖ్యలు
ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ రెండు విడతల్లో 72 ఉపగ్రహాలను ప్రయోగించడానికి వన్‌వెబ్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. మొదటి విడతలో 36 ఉపగ్రహాలను గతేడాది అక్టోబరు 23న ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. తాజాగా 36 ఉపగ్రహాలను ఎల్‌వీఎం-3 రాకెట్ ద్వారా కక్ష్యలోకి పంపనున్నారు. 5,805 కేజీలు బరువు కలిగి ఉన్న 36 ఉపగ్రహాలను 450 కి.మీ. ఎత్తులో ఉన్న లో ఎర్త్ ఆర్బిట్‌లోకి పంపనున్నారు.