NTV Telugu Site icon

Minister Sridhar Babu: మూసీ ప్రక్షాళనకు ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ణానం

Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu

Minister Sridhar Babu: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి ఇజ్రాయెల్ సంసిద్ధత వ్యక్తం పట్ల ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. సచివాలయంలో తనను కలిసిన ఆ దేశపు రాయబారి రువెన్ అజర్‌కు ఆయన ఈ మేరకు కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాల మధ్య పరస్పర సహకారానికి ఇజ్రాయెల్ ఎంతో ఆసక్తి కనబర్చడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కృత్రిమ మేథ, సైబర్ సెక్యూరిటీలో ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని, ఆ రంగాల్లో తెలంగాణకు సహకరించాలని శ్రీధర్ బాబు కోరారు.

Read Also: Telangana Government: లగచర్లలో భూసేకరణ రద్దు.. ఇండస్ట్రీయల్ పార్క్ పేరుతో కొత్త నోటిఫికేషన్..

డిఫెన్స్, వ్యవసాయం, నీటి వినియోగంలో ఆధునిక సాంకేతికత, నూతన పరిశోధనలు, పారిశ్రామిక అభివృద్ధిలో తోడ్పాటునందించాలని మంత్రి చేసిన అభ్యర్థనకు రువెన్ అజర్ సానుకూలంగా స్పందించారు. 200 ఎకరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని ఏర్పాటు చేస్తున్న విషయాన్ని శ్రీధర్ బాబు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, శిక్షణనిచ్చే వారికి అత్యాధునిక శిక్షణ (ట్రెయినింగ్ టు ట్రెయినర్స్)లో మద్ధతు ఇవ్వాలని ఆయన కోరారు. వ్యర్థ జలాల పునర్వినియోగ సాంకేతికతలో తమకు సహకరించాలని శ్రీధర్ బాబు కోరారు. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసామని ఇజ్రాయెల్ దేశం ఏ పరిశ్రమ పెట్టడానికి ముందుకొచ్చినా నైపుణ్యం కలిగిన మానవ వనరులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

నూతన పరిజ్ణానం, పరిశ్రమల ఏర్పాటులో సాయపడితే ఇక్కడి నుంచే ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చని సూచించారు. డిఫెన్స్, ఏరో స్పేస్‌లో స్టార్టప్ సంస్థలకు టెక్నాలజీ సమకూర్చి ముందుకు నడపాలని శ్రీధర్ బాబు కోరారు. మౌలిక వసతుల నిర్మాణంలో రెండు దేశాలు సహకరించుకోవాలని ఇజ్రాయెల్ రాయబారి ప్రతిపాదనకు ఆయన ఆమోదం తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబులు తమ దేశాన్ని సందర్శించాలని రాయబారి రువెన్ ఆహ్వానం పలికారు.