ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశాధ్యక్షుడు ఇసాక్ హర్జోగ్ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను ‘యషార్’ పార్టీ అధినేత గడి ఐజెన్‌కోట్‌కు అప్పగించారు. ఈ మేరకు ఆయన నేడు లేదా రేపు అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. పార్లమెంట్లో ఐజెన్‌కోట్‌కు 67 మంది సభ్యుల మద్దతు లభించగా, ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు 46 సిఫార్సులు మాత్రమే దక్కాయి. మెజారిటీ నిరూపించుకోవడానికి ఆయనకు 28 రోజుల గడువు ఉంటుంది. అయితే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఐజెన్‌కోట్‌కు అంత సులభం కాదు.
ఆయన నేతృత్వంలోని కొన్ని పార్టీలు అరబ్ నాయకత్వ పార్టీలతో కలవడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు, అక్టోబర్ 7 దాడి సమయంలో అధికారంలో ఉన్నవారు రాజకీయాల నుంచి తప్పుకోవాలని వాదిస్తున్న ఐజెన్కోట్.. నెతన్యాహుతో ఎలాంటి కూటమి కట్టేది లేదని స్పష్టం చేశారు. కేవలం లికుడ్ పార్టీ , దాని మిత్రపక్షాలు ఎలాంటి షరతులు లేకుండా తమతో వస్తేనే పరిశీలిస్తామని ఆయన పార్టీ తేల్చిచెప్పింది. ఇదిలాఉంటే, ప్రధాని నెతన్యాహు మాత్రం జాతీయ ఐక్య ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.
అయితే, అరబ్ పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటయితే దేశం తీవ్ర ప్రమాదంలో పడుతుందని, వారు హమాస్‌కు మద్దతు ఇస్తున్నారని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. మరోవైపు, నెతన్యాహు వైఖరిని ఐజెన్కోట్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్ సమాజాన్ని విభజించడమే ఆయన నైజమని ఆరోపించింది. మొత్తానికి ఇజ్రాయెల్‌లో రాజకీయ అస్థిరత కొనసాగుతున్న తరుణంలో, ఐజెన్కోట్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది.

