ఇజ్రాయెల్ రాజకీయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పదవి తీవ్ర ముప్పులో పడింది. 120 స్థానాలున్న ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 61 సీట్లు అవసరం కాగా, నెతన్యాహు నేతృత్వంలోని కూటమి కేవలం 53 స్థానాలకే పరిమితమైంది. గతంలో 68 సీట్లు ఉన్న నెతన్యాహు వర్గానికి ఈ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. 2023 హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్లో తొలిసారిగా జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు అక్కడ తీవ్ర రాజకీయ అనిశ్చితికి దారితీశాయి.
మరోవైపు నెతన్యాహును అధికారం నుంచి దించేందుకు ప్రధాన ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. నెతన్యాహు వ్యతిరేక యూదు పార్టీలకు 48 స్థానాలు రాగా, అక్కడ కీలక శక్తిగా అవతరించిన రెండు ప్రధాన అరబ్ పార్టీలు ‘రామ్’ అండ్ ‘జాయింట్ లిస్ట్’లకు కలిపి 19 సీట్లు వచ్చాయి. తాజాగా ఈ అరబ్ పార్టీలు నెతన్యాహును గద్దె దించేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గాది ఐసెన్కోట్ నాయకత్వంలోని ప్రతిపక్ష కూటమికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధపడినట్లు సమాచారం. ఈ రెండూ కలిస్తే నెతన్యాహు వ్యతిరేక వర్గం బలం 67కు చేరి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు స్పష్టమైన మెజారిటీ లభిస్తుంది.
అరబ్ పార్టీలు నేరుగా ప్రభుత్వంలో చేరకుండా బయటి నుంచి మద్దతు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. 1993లో ఓస్లో ఒప్పందం సమయంలో దివంగత ప్రధాని యిట్జాక్ రాబిన్ ప్రభుత్వానికి అరబ్ పార్టీలు ఎలాగైతే బయటి నుంచి మద్దతు ఇచ్చాయో, ఇప్పుడు కూడా గాది ఐసెన్కోట్కు అదే రీతిలో మద్దతివ్వాలని భావిస్తున్నాయి. కొత్త ప్రభుత్వాన్ని ఆహ్వానించే క్రమంలో అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్కు ఐసెన్కోట్ పేరును తదుపరి ప్రధానిగా ప్రతిపాదించనున్నట్లు అరబ్ నేతలు తెలిపారు. ఈ రాజకీయ సమీకరణలు ఫలించి అరబ్ పార్టీలు మద్దతు ప్రకటిస్తే, సుదీర్ఘకాలం ఇజ్రాయెల్ను పాలించిన నెతన్యాహు ప్రధాని పీఠాన్ని ఖాళీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

