Ishan Kishan: భారత క్రికెట్ జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ పాట్నాలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్రాంచ్‌లో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచాడు. మైదానంలో సిక్సర్లు బాదే ఈ యువ ఆటగాడు, సడన్‌గా ఆర్బీఐ ఆఫీసులో ప్రొఫెషనల్ ఐడీ కార్డ్ వేసుకుని ‘సర్కారీ బాబు’ అవతారంలో కనిపించడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. అక్కడ బ్యాంక్ సిబ్బందితో కలిసి ఇషాన్ దిగిన ఫోటోలు, ఆర్బీఐ ఐడీ కార్డ్ ధరించి ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. క్రికెటర్‌గా ఎంతగానో గుర్తింపు పొందిన ఇషాన్ ఆర్బీఐలో ఉద్యోగం చేస్తున్నాడనే విషయం చాలా మంది అభిమానులకు తెలియకపోవడంతో ఈ ఫోటోలు చూసి వీరంతా అవాక్కయ్యారు.
నిజానికి ఇషాన్ కిషన్ 2017లోనే స్పోర్ట్స్ కోటా కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ‘అసిస్టెంట్ మేనేజర్’గా నియమితులయ్యాడు. అప్పటికి అతడి వయస్సు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. క్రికెట్‌లో రాణిస్తున్న సమయాల్లోనే కిషాన్ ఈ ఉద్యోగాన్ని సాధించాడు. కేవలం పేరుకే ఉద్యోగం కాకుండా, ఆర్బీఐ తరఫున డీవై పాటిల్ వంటి అనేక ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నమెంట్లలోనూ ఇషాన్ ప్రాతినిధ్యం వహించి ఆడుతుంటాడు. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్, ఇతర మ్యాచ్‌లతో బిజీ షెడ్యూల్ వల్ల దొరికే కొద్దిపాటి విరామ సమయంలో పాట్నాలోని ఆర్బీఐ ఆఫీస్‌కు వెళ్లి తన విధులు నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలోనే ఆఫీస్‌కు వచ్చిన తనతో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు బ్యాంక్ ఉద్యోగులు తీవ్రంగా పోటీ పడ్డారు. ఇషాన్ సైతం ఎంతో వినయంగా అందరితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చాడు.
ఆర్బీఐలో అసిస్టెంట్ మేనేజర్ పదవి అనేది గ్రేడ్-ఎ లెవల్ హోదాకు చెందుతుంది. ఈ ఉద్యోగానికి జీతం కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీని బేసిక్ పే చూస్తే రూ. 45,000 నుంచి రూ. 49,000 వరకు ఉంటుంది. దీనికి వివిధ రకాల అలవెన్సులు, ప్రభుత్వ సౌకర్యాలన్నీ కలుపుకుంటే నెలకు రూ. 90,000 నుంచి రూ. 1,15,000 వరకు గ్రాస్ శాలరీ వస్తుంది. అన్ని రకాల మినహాయింపులు (Deductions) పోను చేతికి రూ. 75,000 నుంచి రూ. 90,000 వరకు లభిస్తుంది. ఈ లెక్కన ఇషాన్ కిషన్‌కు ఆర్బీఐ నుంచి ప్రతి నెలా సుమారు రూ. 90 వేల వరకు వేతనం అందుతోంది. బిజీ క్రికెట్ లైఫ్‌లోనూ ఉద్యోగ బాధ్యతలను మర్చిపోకుండా నెరవేరుస్తున్న ఇషాన్ కిషన్‌ను నెటిజన్లు విశేషంగా అభినందిస్తున్నారు.

