Site icon NTV Telugu

Pakistan Political Crisis: పాకిస్థాన్‌లో హిస్టరీ రిపీట్ కానుందా.. భుట్టో-జియా తర్వాత మరో నియంత రాబోతున్నాడా?

Pakistan Political Crisis

Pakistan Political Crisis

Pakistan Political Crisis: పాకిస్థాన్‌లో మరోసారి హిస్టరీ రిపీట్ కానుందా.. భారతదేశానికి వ్యతిరేకంగా జరిగే ప్రతి పెద్ద యుద్ధం లేదా సైనిక చర్య తర్వాత, దాయాది దేశంలో ఒక నియంత ఉద్భవిస్తాడు. 1971 ఇండో-పాకిస్థాన్ యుద్ధం తర్వాత, జనరల్ జియా-ఉల్-హక్ అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. కార్గిల్ యుద్ధం తర్వాత జనరల్ పర్వేజ్ ముషారఫ్ తిరుగుబాటు చేశాడు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత అసిమ్ మునీర్ నియంతగా మారే మార్గంలో ఉన్నాడని జోరుగా ప్రచారం వినిపిస్తుంది. అసిమ్ మునీర్ మొదట ఫీల్డ్ మార్షల్‌గా, ఆ దేశ రాజ్యాంగ సవరణ ద్వారా, రక్షణ దళాల అధిపతిగా (CDF) స్థాయికి ఎదగడం ఈ ప్రచారానికి స్పష్టమైన సూచనగా విశ్లేషకులు చెబుతున్నారు.

READ ALSO: MLA Anirudh Reddy : కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించేందుకు.. బీఆర్ఎస్, బీజేపీ ఒకటయ్యాయి..

పాకిస్థాన్ స్వాతంత్ర్యం పొందిన 78 సంవత్సరాలలో 33 సంవత్సరాలు సైనిక నియంతల పాలనలో ఉంది. మొదటిసారిగా 1958లో జనరల్ అయూబ్ ఖాన్ పదవీచ్యుతి అయ్యాడు. 1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధం అయూబ్ ఖాన్‌పై ఒత్తిడిని పెంచింది, కానీ ఆయన స్వయంగా సైనిక నియంత కాబట్టి, ఆ ఒత్తిడిని ఆయన తట్టుకొని ఉన్నాడు. కానీ పాక్ చరిత్రలో 1971 యుద్ధం ఒక కీలక మలుపుగా చెబుతారు. ఈ యుద్ధంలో పాకిస్థాన్ ఓటమి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసింది. జనరల్ యాహ్యా ఖాన్ నాయకత్వంలో పాకిస్థాన్ ఈ ఓటమిని చవిచూసింది. ఈ పరాజయం ఆయనకు తన స్వదేశంలో తీవ్ర అవమానానికి గురి చేసింది. దీంతో దేశంలో తిరుగుబాటు జరుగుతుందనే పుకార్లు వ్యాపించాయి. ఆ సమయంలో దేశంలో నెలకొన్న ఈ అశాంతిని నివారించడానికి యాహ్యా ఖాన్ అధ్యక్ష పదవిని, ప్రభుత్వ పగ్గాలను డిసెంబర్ 20, 1971న అప్పటి శక్తివంతమైన, ప్రజాదరణ పొందిన పీపుల్స్ పార్టీ ప్రతిష్టాత్మక నాయకుడు జుల్ఫికర్ అలీ భుట్టోకు అప్పగించాడు.

అయితే భుట్టో రాజకీయ జీవితం ఐదు లేదా ఆరు సంవత్సరాలు కొనసాగింది. 1977లో పాకిస్థాన్ తీవ్ర రాజకీయ సంక్షోభంలో మునిగిపోయింది. మార్చి సార్వత్రిక ఎన్నికలలో జుల్ఫికర్ అలీ భుట్టో PPP పార్టీ అఖండ విజయం సాధించింది, కానీ ప్రతిపక్ష PNA విస్తృతంగా రిగ్గింగ్ జరిగిందని ఆరోపించింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా అనేక హింసాత్మక నిరసనలు చెలరేగాయి. దీంతో లాహోర్, కరాచీలలో అల్లర్లు, పోలీసు కాల్పులు, వందలాది మంది మరణాలు సంభవించాయి. ఈ ఘర్షణల కారణంగా కొన్ని పార్టీలు భుట్టోను ఏకంగా కాఫీర్‌గా ప్రకటించాయి. 1977 ఎన్నికల వ్యతిరేక ఉద్యమం సందర్భంగా జుల్ఫికర్ అలీ భుట్టోను పాకిస్థాన్ నేషనల్ అలయన్స్ (PNA) “కాఫిర్” అని ముద్ర వేసింది. PNAలో జమాత్-ఇ-ఇస్లామి, జమియత్ ఉలేమా-ఇ-ఇస్లాం, జమియత్ ఉలేమా-ఇ-పాకిస్థాన్ వంటి రాడికల్ ఇస్లామిస్ట్ పార్టీలు ఉన్నాయి. వారికి భుట్టోను మొదట్లో “లౌకిక,” “సోషలిస్ట్”, “మద్యపాన” నాయకుడిగా ముద్ర వేశారు. ఇది ఇస్లాంకు వ్యతిరేకం.

మార్చి 1977 నుంచి PNA “నిజామ్-ఎ-ముస్తఫా” పేరుతో మొత్తం ఉద్యమాన్ని ప్రారంభించింది. భుట్టో ఇస్లామిక్ చట్టాలను ఉల్లంఘించాడని, అందువల్ల ఆయన ఒక కాఫిర్ అని, ఆయన పాలన హరామ్ అని వారు నినదించారు. 1974లో అహ్మదీలను ముస్లిమేతరులుగా ప్రకటించడం ద్వారా భుట్టో ఇస్లామిక్ పార్టీలను సంతృప్తిపరిచాడు. కానీ 1977లో ఈ పార్టీలే మళ్లీ భుట్టో ప్రదర్శన కోసం మాత్రమే ఇలా చేశాడని, వాస్తవానికి ఆయన ఒక కాఫిర్ అని చెప్పడం ప్రారంభించాయి. దీంతో ఏప్రిల్‌లో మూడు ప్రధాన నగరాల్లో మార్షల్ లా విధించారు. జూన్, జూలైలలో, భుట్టో, PNA మధ్య ఒక ఒప్పందం దాదాపుగా ఖరారు అయింది. జూలై 4న ఈ ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకం చేయడానికి షెడ్యూల్ చేశారు. అయితే ఈ ఒప్పందాన్ని సైన్యం ఆమోదించలేదు.

భుట్టో గతంలో అనేక మంది సీనియర్ జనరల్స్‌ను పక్కనపెట్టి జియా-ఉల్-హక్‌ను ఆర్మీ చీఫ్‌గా నియమించాడు. దీంతో సైన్యంలో భుట్టోపై ఆగ్రహం నెలకొంది. జూలై 5, 1977 రాత్రి, జియా-ఉల్-హక్ భుట్టోను అరెస్టు చేసి మార్షల్ లా విధించాడు. ఇది పాకిస్తాన్ చరిత్రలో అత్యంత రక్తపాత తిరుగుబాటుగా చరిత్రలో నిలిచిపోయింది. పాకిస్థాన్‌లో జియా-ఉల్-హక్ 11 సంవత్సరాలు నియంతగా ఉన్నాడు. ఇస్లామీకరణ ముసుగులో తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు. కానీ ఈ నియంత 1988లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించాడు.

ఇది జరిగిన పది సంవత్సరాల తరువాత 1999 లో మళ్లీ పాకిస్థాన్ మరోసారి రాజకీయ, సైనిక సంక్షోభానికి గురి అయ్యింది. పాకిస్థాన్ సైన్యం 1999 శీతాకాలంలో కార్గిల్ శిఖరాలను స్వాధీనం చేసుకుంది. దీంతో తలెత్తిన కార్గిల్ యుద్ధంలో భారతదేశం పాకిస్థాన్‌ను ఓడించి, ఆ దేశ సైన్యా్న్ని వెనక్కి తగ్గేలా చేసింది. ఇది జరిగిన కొన్ని నెలల తర్వాత జనరల్ పర్వేజ్ ముషారఫ్ తిరుగుబాటు చేసి, ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌ను పదవీచ్యుతుని చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. 9/11 తర్వాత అమెరికాతో పొత్తు, ఉగ్రవాదంపై యుద్ధం సహా ముషారఫ్ పాలన 2008 వరకు కొనసాగింది. ముషారఫ్ 2023లో ప్రవాసంలో ఉండగా మరణించారు.

ఇప్పుడు పాకిస్థాన్‌లో మరొక నియంత కథ ఆరంభం కానుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆయనే ప్రస్తుత ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్. ఆయన నవంబర్ 2022 నుంచి పదవిలో ఉన్నారు. ఈ సంవత్సరం మేలో జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి భారతదేశం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించినప్పుడు, పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. భారతదేశం పాకిస్థాన్‌ స్థావరంగా ఉన్న ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసింది, అలాగే అనేక పాక్ వైమానిక స్థావరాలపై దాడి చేసింది. కానీ అసిమ్ మునీర్ ప్రపంచ దేశాల ముందు అబద్ధం చెప్పి, ఈ యుద్ధంలో పాకిస్థాన్ విజయం సాధించిందని పేర్కొన్నాడు. ఈ అబద్ధపు సైన్యం విజయాన్ని సాకుగా ఉపయోగించి, పాక్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ ప్రభావంతో ఆయన ఫీల్డ్ మార్షల్ హోదాకు తన పదోన్నతిని పొందాడు.

డిసెంబర్ 2025లో ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ మున్నిర్‌ను ఐదు సంవత్సరాల కాలానికి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (COAS)గా నియమించారు. దీంతో పాటు మూడు సాయుధ దళాలపై ఏకీకృత కమాండ్‌ను అందించే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF) అనే కొత్త పదవిలో కూడా నియమించారు. ఇది పాకిస్థాన్‌లో మునీర్ ప్రభావాన్ని మరింతగా పెంచింది. నిజానికి ఆయన ఇప్పటికే ఆ దేశ సైనిక-రాజకీయ కూటమి ద్వారా నియంతృత్వ పునాదులను బలోపేతం చేసుకున్నాడని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తు్న్నారు. అవకాశం వస్తే మునీర్ పాకిస్తాన్ రాజకీయ శక్తిని స్వాధీనం చేసుకోగలడనడంలో సందేహం లేదని చెబుతున్నారు.

READ ALSO: Akhanda 2 : అఖండ2 నిర్మాతలకు బిగ్ రిలీఫ్

Exit mobile version